– హామీ మేరకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
మెట్‌పల్లి (జగిత్యాల), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లకు సంబంధించి చెరకు రైతులతో శుక్రవారం ముఖాముఖి చర్చలో ఆయన పాల్గొన్నారు. చెరకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇందుకు సాంకేతికంగా, స్థానికంగా ఉన్న సమస్యలపై అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఫ్యాక్టరీ ప్రైవేట్ ఆధీనంలో కొనసాగిందన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీపై ఉన్న రూ.172 కోట్ల బకాయిలు ప్రభుత్వం తీర్చిందన్నారు. జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల, కథలాపూర్, జగిత్యాల మండలాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలు, నిర్మల్ జిల్లాలోని కొన్ని మండలాల రైతులకు చెరకు ఫ్యాక్టరీ పునఃప్రారంభించడం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇదివరకు చెరకు రైతులు కామారెడ్డిలోని షుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలించేవారని, తద్వారా రైతులపై రవాణా ఖర్చులు అధిక భారం అవుతున్న నేపథ్యంలో వరంగల్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు విత్తనాలు, సబ్సిడీ, మద్దతు ధర కల్పిస్తామని భరోసా కల్పించారు. 100 శాతం రైతులకు సహాయసహకారాలు అందించి ఆదుకుంటామన్నారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలంటే రైతులు కనీసం 10 వేల నుండి 15వేల ఎకరాలు చెరకు సాగు చేయాలని కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి రైతులు వరి, మొక్కజొన్న పంటలు అధికంగా పండిస్తున్నారని వాటితోపాటు పరిస్థితులకనుగుణంగా పంట మార్పిడి చేయాలని, తద్వారా అధిక దిగుబడులు అందుతాయని తెలిపారు. స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖకు సీడ్స్, సబ్సిడీలు కేటాయిస్తుందని తెలిపారు. చెరకు పంటలను డ్రిప్ పద్ధతుల ద్వారా పండిస్తే అధిక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉన్న తమ ఆకాంక్షను నెరవేర్చనున్న రాజకీయ నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన నాటినుండి నేటి వరకు ఈ ప్రాంతంలో చెరకు పంట పండిస్తున్నామని రైతులు తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడినా కొంతమంది రైతులు చెరకు పండించి కామారెడ్డిలోని షుగర్ ఫ్యాక్టరీ కి తరలించడంవల్ల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులకు ఏర్పాటు చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు అందుతుందని, వరద కాలువ వల్ల భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో మెండుగా ఉన్నాయని తెలిపారు. కోతుల బెడద ఎక్కువ ఉన్నందున అధికారులు తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రభుత్వం సబ్సిడీలో విత్తనాలు, రవాణా ఖర్చులు భరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్, నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిశ్రమలు-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ-వ్యవసాయ శాఖ రఘునందన్ రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ సిహెచ్.నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పి అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





