– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ‘ఆత్మ’ చైర్మన్ సుంకవెల్లి, 24 సభ్యుల ప్రమాణ స్వీకారం
– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు,
– 19 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
దమ్మపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కమిటీ ఏర్పాటు రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కమిటీ చైర్మన్, 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, 966 ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 19 లబ్ధిదారులకు రూ.19,02,204 చెక్కుల పంపిణీ కార్యక్రమం అశ్వరావుపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ పదవికి నియామకం ద్వారా రౖౖెతుల సంక్షేమం, పేదవర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడేళ్లల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా, భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని, ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు సులభంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఏది చేయగలం ఏది చేయలేం అని అంచనాతో పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ఉండేలా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. పేదవారు ఎక్కడా తలదించుకోకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలని చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే మొదటిసారిగా అశ్వరావుపేట నియోజకవర్గంలో జరిగినందుకు సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి నాయకత్వంలో పేదవర్గాల సంక్షేమానికి అవకాశం సృష్టించడం గొప్ప కార్యక్రమం అని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, ఆత్మ కమిటీ సభ్యులు పంటల, వ్యవసాయ, చేపల పెంపకం, ఇతర సబ్సిడీ స్కీమ్స్‌లో నేరుగా లబ్ధి పొందేలా జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




