– దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. ఎక్కడా అలాంటి కార్యక్రమాలు లేవని విమర్శించారు. వర్షాలకాలంలో సైతం పంట నష్టం జరిగినా, వివరాలు సేకరించినా ఇంతవరకూ ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు నష్టం జరిగినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగినా, ఇప్పటి వరకు కలెక్టర్ గాని, సంబంధిత అధికారులు గాని స్పందించలేన్నారు. వెంటనే స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇటీవల వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కూరగాయలు దెబ్బతినగా, మామిడి కాయలు రాలిపోయాయి. సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న, ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడ్గు, దమ్మన్నపేట్, గోవింద్‌పల్లి, కేశారం, ధర్పల్లి, బెలియతండా, సిరికొండ మండలంలోని తాటిపల్లి, పెద్దవాల్గోట్, పందిమడుగు, కొండూర్, చీమన్‌పల్లీ, జినిగ్యాల తదితర గ్రామాల్లో పంటలు దెబ్బతిని రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట కండ్ల ముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇందల్వాయి రోడ్డు, దమ్మన్నపేట్ రోడ్డులో అడ్డంగా చెట్లు నేలకూలాయి. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ రూరల్ మండలం మాధవనగర్‌లో ఈదురుగాలులకు ఓ చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడగా స్తంభం విరిగి విద్యుత్ తీగలు తెగి రామసాని కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యు త్‌షా క్‌తో మృత్యువాతపడ్డాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





