- నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు
- ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు
- యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు
మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తమకు సరిపడా యూరియా సరఫరా (Urea Supply) చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. పలు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు నెపం వేయడం తప్ప తమ సమస్యలన తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రైతులు రోజుల తరబడి యూరియా షాపుల వద్ద కాపలా కాస్తున్నారు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం యూరియాను అంచనాకు మించే సరఫరా చేశామని చెబుతున్నారు. అంచనాకు మించి సరఫరా చేస్తే రైతులెందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై బిజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సింది, కానీ కేంద్రం ఇవ్వటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా తెలంగాణకు ఎక్కువే పంపించామని కేంద్రం చెబుతున్నప్పటికీ రైతులకు మాత్రం యూరియా అందకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది.
Urea Supply : మానుకోటలో రైతుల ధర్నా
మానుకోటలోని జిల్లాలోని పలు మండలాలలో రైతులు యూరియా కోసం ధర్నా చేస్తున్నారు. వీరికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నాయి. బయ్యారం, గూడూరు, నెల్లికుదురు, గార్ల, డోర్నకల్, మండలాల్లో రైతులు యూరియా కోసం రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనేకమంది రైతులు భారీ వర్షంలో సైతం ఇండ్లలోకి పోకుండా షాపుల ముందే నిలబడి తడుస్తూ యూరియా కోసం ఎదురు చూశారు. అయినా సరఫరా చేయడం లేదు. చివరికి కలెక్టర్ తో పాటు అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. చివరికి రైతులు యూరియా కోసం లైన్ లో నిలబడుతున్న సమయంలో తొక్కిసలాట జరుగుతోంది. పోలీసులు చివరికి జిల్లా ఎస్పీ యూరియా అమ్ముతున్న షాపుల వద్దకు వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు. రైతులందరికీ యూరియా వస్తుందని అధికారులు భరోసా ఇస్తున్నప్పటికీ వారికి నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే వారం రోజులుగా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందుబాటులోకి తెచ్చామని చెప్పుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. దీంతో రైతులు ప్రభుత్వాలను నమ్మడం లేదు. గురువారం మరిపెడలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు భారీ ఎత్తున తరలివచ్చి ధర్నా చేపట్టి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ రైతు తలకు బలమైన గాయమైంది. ఇప్పటికైనా పాలకులు రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, మాస్ లైన్ నాయకులు ఉమ్మగాని సత్యం తదితరులు డిమాండ్ చేశారు. అదును దాటిన తర్వాత యూరియా అందించినా అవి రైతులకు మేలు జరగదు. అందుకే ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని పలు పార్టీల నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.





