– అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: కాంగ్రెస్ సర్కారు యూరియా యాప్ పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు లేవని, ఇక స్మార్ట్ ఫోన్‌లు ఉన్న 50 శాతం మందిలో కూడా 50 శాతం మందికి యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదని అన్నారు. ఇలా మొత్తంగా 75 శాతం మంది రైతులు యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. వారంతా సేవా కేంద్రాలకు పోయి యూరియా బుక్ చేయించుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత మరో రోజు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇలా రెండు రోజులు సమయం రైతుకు వృథా అవుతున్నదని చెప్పారు. ఇక ఒక దఫాలో 5 బస్తాల కంటే ఎక్కువ యూరియా ఇవ్వడంలేదని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో మూడు నాలుగు ఎకరాల్లో మక్క పంట వేసిన రైతు మూడు దఫాల్లో రెండేసి రోజుల చొప్పున మొత్తం ఆరు రోజులు యూరియా కోసం తిరగాల్సి వస్తున్నదని చెప్పారు. మండలానికి ఒక్క కేంద్రంలో మాత్రమే యురియా ఇస్తుండటంతో చాలా గ్రామాల రైతులు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి మండలానికి ఒక్కచోట మాత్రమే కాకుండా ఎక్కువచోట్ల యూరియా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. దఫాకు 5 బస్తాల పరిమితిని ఎత్తేసి, రైతు వేసిన పంటకు ఎంత యూరియా అవసరమో అంతా ఒకేసారి ఇవ్వాలన్నారు.
——————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.