– చెరువులు, కుంటల పరిరక్షణకు సూచనలు
– ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ రాష్ట్ర సచివాలయంలో శనివారం భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి వున్నారు. ఇప్పటి వరకు రైతు కమిషన్ చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై మంత్రికి సూచనలు చేసింది. మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలనీ చెప్పింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నీటి సంఘాలు వున్న అంశాన్ని గుర్తుచేసింది. గ్రామీణ స్థాయిలో రైతులు సంఘటితమై చెరువులను కాపాడుకునే వారని, ఐతే గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు అన్యాక్రాంతమయ్యాయని వివరించింది. కొన్నిచోట్ల కబ్జాదారులు ఆక్రమించి లే ఔట్లు వేయడం, వాటర్ బాడీస్ కు వచ్చే క్యాచ్ మెంట్ ఏరియాల్లో భారీగా కాల్వలు దెబ్బతినడం, మాయమవడం జరిగాయని వివరించింది. ఐతే ప్రధానంగా చెరువులు కుచించుకుపోవడం, గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని వివరించింది. రాష్ట్రంలో చెరువులు కాపాడుకుపడానికి సమగ్రమైన పాలసీ ఉండాలని రైతు కమిషన్ తెలిపింది. ఆ పాలసీని కమిషన్ తయారు చేయనున్నట్లు వివరించింది. నిపుణులతో పాలసీ కి సంబంధించి ప్రజెంటేషన్ మీటింగ్ త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు.. ఆ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకావాలని కమిషన్ కోరింది. కమిషన్ ఆహ్వానానికి మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్‌చాట్
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ అన్ని రకాలుగా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విలేకరులతో చిట్‌మాట్లాడుతూ చెప్పారు. పోలవరం బనకచర్లకు పర్యావరణ శాఖ, జీఆర్‌ఎంబీ వ్యతిరేకించాయన్నారు. దీనిపై తానే స్వయంగా తన లెటర్ హెడ్‌తో కేంద్రానికి లేఖలు రాశానని ఆయన తెలిపారు. బనకచర్లను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, తమ స్టాండ్ క్లియర్‌గా ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ నిరాధారమైన ఆరోపణలు పబ్లిసిటీ కోసం మాత్రమేనని, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. కాగా, 650 పేజీలతో కాళేశ్వరంపై జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని, ఆదివారం సాయంత్రం కమిషన్ రిపోర్ట్ అధ్యయనం కమిటీతో సమావేశం అవుతానని, ఈనెల 4న కేబినెట్‌లో ఆయా అంశాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.





