– రైతు భరోసా కోసం శాటిలైట్ ఇమేఇ్ మ్యాపింగ్ పూర్తి చేయాలి
– ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
– సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
– వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని పున:ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఆపేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నదంటూ ఇప్పటికే జాతీయ ఆహర భద్రత మిషన్ లో భాగంగా పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించామని గుర్తుచేశారు. ఇప్పుడు రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు, ఈ పథకంలో భాగంగా 1.31లక్షల మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు/యంత్రాలు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారీగా పర్యటించి రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని మంత్రి సూచించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కారాలు అందించాలన్నారు. కేంద్రం నుండి వచ్చే ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి రూ.400 కోట్లను వినియోగించినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తూ, ఆ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇది రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.
యూరియా యాప్‌పై అనవసర రాద్ధాంతం
యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్ సమర్థవంతంగా అమలవుతోందని, రైతులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, యాప్ ద్వారా కూడా రైతులు తమకు కావాల్సినంత యూరియాను కొనుగోలు చేయొచ్చని, కావున రైతులెవరూ అనవసర భయాందోళనకు గురి కావద్దని మంత్రి కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యూరియా యాప్‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రబీ సీజన్ రైతు భరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తిచేసి నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు వివరించి దీర్ఘకాలికంగా మట్టిసారాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించే విధానాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





