యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ వీడ్కోలు సమావేశంలో వక్తలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: చట్టపరమైన మానవీయతతో కూడిన తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ వెలువరించారని హైకోర్టులో జరిగిన ఫుల్ కోర్టు సమావేశం కొనియాడిరది. జస్టిస్ సుజయ్‌పాల్ కోల్‌కతాకు బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఫస్ట్ కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో మరో న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషి ప్రసంగించారు. సమర్ధత, నిబద్ధతలతో పనిచేయడంలో ఇతరులకు జస్టిస్ సుజయ్‌పాల్ ఆదర్శమన్నారు. అందరికీ తొలి గురువు అమ్మ అని, అయితే ఇంట్లోనే కాకుండా తరగతి గదిలోనూ అమ్మే ఆయనకు ఉపాధ్యాయురాలిగా విద్యాబుద్ధులను నేర్పించారని గుర్తు చేశారు. లక్ష్య సాధనకు అమ్మ అండదండలు ఉండడం వల్లే జస్టిస్ సుజయ్‌పాల్ తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ స్థాయికి చేరారని చెప్పారు. బదిలీపై వెళుతున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌కు ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. సమావేశంలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 4,223 మెయిన్, 5 వేల మిస్లీనియస్ కేసులను జస్టిస్ సుజయ్‌పాల్ పరిష్కరించారని చెప్పారు. న్యాయమూర్తులతోపాటు అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్స్ ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు జగన్, రిజిస్ట్రార్లు, కోర్టు సిబ్బంది, జస్టిస్ సుజయ్‌పాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ కూడా జస్టిస్ సుజయ్‌పాల్‌ను సత్కరించింది.





