కవితది వారి కుటుంబ సమస్య

– అవినీతి సొమ్ము పంపకంలో వచ్చిన తగాదాలు
– ఆమె సస్పెన్షన్‌పై మేం స్పందించబోం
– కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదు
– పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తదితరుల విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్‌ కావడంపై తాము స్పందించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఆస్తులు, వాటాల్లో వారి మధ్య తగాదాలున్నాయని గతంలోనే తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ తగాదాలే సస్పెన్షన్‌కు దారి తీసి ఉండొచ్చన్నారు. కొందరు కవిత వెనుక ఉన్నామన్నారు. మరికొందరు హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక ఉన్నామని చెబుతున్నారు. కానీ, మేం ప్రజల వెంట ఉన్నాం. మిగతా ఎవరి వెనకాల లేము. తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం.. ప్రజలు మా వెంట ఉన్నారు.. ఎవరికో వత్తాసు పలకాల్సిన అవసరం తమ పార్టీకి, సీఎంకు లేదు అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి సంపదలో వాటాల విషయంలో తగాదా వచ్చినట్లుందని, వారి తగాదాలతో తమకు సంబంధం లేదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అలాగే కవితను కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదని, అవినీతిపరులకు ఇందులో స్థానం లేదని అన్నారు. ఇదిలావుంటే కవితను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేయడంపై కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. కల్వకుంట్ల కవితది కుటుంబ సమస్య, డబ్బుల సమస్య అని అవర్ణించారు. కవిత సస్పెన్షన్‌ విషయం కాంగ్రెస్‌కు సంబంధం లేని అంశమని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై పూర్తి విషయాలు బయట పెట్టాలంటూ కవితను డిమాండ్‌ చేశారు. హరీష్‌ రావు, సంతోష్‌ రావు వెనక రేవంత్‌ రెడ్డి ఎందుకు ఉంటారని అనిల్‌ కుమార్‌ ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కవిత చెప్పిన విషయాలను సాక్ష్యంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పదేళ్ల అవినీతి విషయాలను రాతపూర్వకంగా సీబీఐకి ఇవ్వాలని కవితకు సూచించారు. తన కుటుంబంలో ఎవరెంత అవినీతి చేశారో కూడా బయట వచ్చి చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి కవితను తీసుకునేదే లేదని ఎంపీ చామల స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *