– అక్రమంగా నిల్వ ఉంచి దొరికింది ఆ పార్టీవారే
– గాంధీ విగ్రహం పెట్టడానికి వందల కోట్లు అక్కర్లేదు
– మూసీ పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు
– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: దేశంలో గ్యాస్ కొరత ఏమాత్రం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ ఫెడరేషన్ ఆఫ్ కాలనీల సభ్యులు వందలాదిమంది ఒంటేరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా వారికి రామచందర్‌రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న రాజీ లేని పోరాటం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. నేడు మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు చేరడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో పార్టీ మరింత తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజువారీ గ్యాస్ డిమాండ్ 55 లక్షల సిలిండర్లు కాగా కాంగ్రెస్ సృష్టించిన భయాందోళనల వల్ల అది 76 లక్షలకు పెరిగిందన్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎందుకుందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో యూత్ కాంగ్రెస్ నాయకులు వేలాది సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ పట్టుబడ్డారన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నా ప్రధాని మోదీ ఆయా దేశాలతో మాట్లాడి హర్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు గ్యాస్, చమురు సరఫరా ఆగిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు 50% పెరిగినా భారత్‌లో ధరలు పెరగకుండా సామాన్యుడిని కాపాడుతున్న ఘనత ప్రధాని మోదీదన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్, సౌదీ-ఇరాన్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో మాత్రం సామాన్యుడిపై భారం పడకుండా, సరఫరాలో కొరత లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పకడ్బందీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ధరలు పెరగకపోగా, కొరత రాకుండా చూడటం మోదీ ఆర్థిక వ్యూహానికి నిదర్శనమన్నారు. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
మూసీ ప్రాజెక్టును రూ.7వేల కోట్లకు పెంచిన రేవంత్
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్‌ను రూ.60 వేల కోట్ల నుండి రూ.లక్షన్నర కోట్లకు పెంచినట్టే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టును రూ.5 వేల కోట్ల నుండి అప్పుడే రూ.7 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసీ నది శుద్ధి చేయాలని, మూసీలో కలిసే మురుగు నీళ్లు, పారిశ్రామిక వ్యర్థాలు ఆపకుండా, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కట్టకుండా కేవలం పేదల ఇళ్లు కూల్చడం ఏమిటి అని నిలదీశారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం 10 వేల మందికి ముందుగా పునరావాసం కల్పించి పక్కా ఇళ్లు ఇచ్చిన తర్వాతే సబర్మతి ప్రాజెక్టును చేపట్టిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం చేతిలో పలుగు పట్టుకుని పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గాంధీ విగ్రహం పెట్టడానికి వందల ఎకరాలు, బఫర్ జోన్ల పేరుతో పేదల ఇళ్లు కూల్చడం అన్యాయమంటూ చట్టబద్ధంగా ఇళ్లు కట్టుకున్న వారిని రోడ్డున పడేస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. కేసీఆర్ హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తానని ఎలాగైతే మోసం చేశారో రేవంత్ రెడ్డి కూడా మూసీ పేరుతో అదే బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల పొట్ట కొట్టడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి అందెల శ్రీరాములు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




