స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కోండి

అశోక్ పోగు సైకాల‌జిస్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలంగాణ సైకాల‌జిస్ట్స్ అసోసియేష‌న్‌

ఇటీవల కాలంలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 10 నుండి ఈ అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గా జరుపుకోవాలని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (ఐఎస్పీ), అనేక స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్”ఆత్మహత్యలపై ఉన్న ఆలోచనలను మార్చడం” . ఈ థీమ్ ప్రధాన లక్ష్యం ఆత్మహత్య గురించి ఉన్న పాత ప్రతికూల భావనలను తొలగించి సానుకూల మరియు నేరుగా మాట్లాడటాల‌ను ప్రోత్సహించడం. విద్యాపరమైన ఒత్తిడి, పరీక్షలలో మార్కులు, కుటుంబ అంచనాలు, తోటివారి ఒత్తిడి, ప్రేమ వైఫల్యాలు సామాజిక పోలికలు చాలామంది విద్యార్థులలో ఆత్మహత్య ఆలోచనలు కలగడానికి ప్రధాన కారణాలు. ఈ ఆలోచనలు తరచుగా నిస్సహాయత, ఒంటరితనం, భవిష్యత్తుపై నిరాశావాదం వంటి భావాల నుండి పుడతాయి. భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు చాలా క్లిష్టమైనవ‌నే చెప్పాలి. పోటీ పరీక్షలలో వైఫల్యం, తక్కువ మార్కులు రావడం తల్లిదండ్రుల, సమాజం యొక్క అధిక అంచనాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.

ఈ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. కుటుంబంలో నెలకొన్న కలహాలు, ఆర్థిక సమస్యలు, మరియు తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను అర్థం చేసుకోకపోవడం వంటివి కూడా ఆత్మహత్యలకు దారితీస్తాయి. పిల్లల చదువు, భవిష్యత్తుపై తల్లిదండ్రులు చూపించే ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. ప్రేమలో వైఫల్యం, తిరస్కరణ లేదా ఇతర సంబంధిత సమస్యలు యువ విద్యార్థులలో మానసిక ఆందోళనను పెంచుతాయి, ఇవి కొన్నిసార్లు ఆత్మహత్యలకు పురికొల్పుతాయి. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతాయి. చాలామంది విద్యార్థులు ఈ సమస్యలను బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. వారికి సరైన కౌన్సెలింగ్ అందుబాటులో ఉండదు. ర్యాగింగ్, లైంగిక వేధింపులు, సామాజిక వివక్ష, మరియు ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా ఆత్మహత్యలకు కారణాలుగా నిలుస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.ఈ ఆలోచనలు కేవలం ఒక తాత్కాలికం మాత్రమేనని మరియు సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు, విద్యార్థుల ఆత్మహత్యల వల్ల కుటుంబ సభ్యులపై విపరీతమైన వత్తిడి బాధ ఉంటాయి.

విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కుటుంబ సభ్యులు తీవ్రమైన దుఃఖం, షాక్ మరియు నమ్మలేని స్థితికి లోనవుతారు. ఎందుకంటే ఇది అనూహ్యమైన, వారు ఊహించలేని సంఘటన. ఈ దుఃఖం శోకం, ఆందోళన మరియు నిస్సహాయతకు దారితీస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇతర కుటుంబ సభ్యులు తరచుగా తమను తాము నిందించుకుంటారు. తమ ప్రియమైనవారి ఆవేదనను గుర్తించలేకపోయామని, లేదా ఆత్మహత్యను నిరోధించడానికి ఏదైనా చేయలేకపోయామని భావిస్తారు. ఈ అపరాధ భావం చాలా బాధాకరంగా వుంటుంది. ఈ సంఘటనల వల్ల కుటుంబ సభ్యులు నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి మరియు కుంగుబాటు వంటి వాటికి గురవుతారు. దీనివల్ల వారి శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. విద్యార్థి చనిపోయిన తర్వాత, కుటుంబం సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. సమాజం వారిని ఎలా చూస్తుందో అని భయపడతారు. అంతేకాకుండా, విద్యార్థి చదువు కోసం పెట్టిన ఆర్థిక పెట్టుబడులు మరియు భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ అస్తవ్యస్తమవుతాయి.

ఆత్మ‌హ‌త్య‌ల‌ను ఈవిధంగా అడ్డుకోండి
మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ భావాల గురించి నమ్మకమైన వారితో ఓపెన్ గా మాట్లాడి మీ కష్టసుఖాలను పంచుకోండి వీలైతే సైకాలజిస్ట్‌ల‌ను సంప్రదించి ప్రతి విషయాన్ని వారికి చెప్పి తగిన సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఆత్మహత్య ఆలోచనలను అణచివేయడానికి ప్రయత్నించడం కంటే, వాటిని గుర్తించడం మరియు అంగీకరించడం ముఖ్యం. ఇది సవాలుతో కూడుకున్నది కావచ్చు, కానీ దానిని అంగీకరించడం ద్వారా వాటిని ఎదుర్కోవడం ప్రారంభించవచ్చు. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు వంటి శాంతినిచ్చే వ్యాయామాలు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం కూడా మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. పెద్ద లక్ష్యాలను సాధించడంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడంపై దృష్టి పెట్టాలి.

రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం వ్యాయామం, యోగా, సంగీతం వినడం లేదా మీకు ఇష్టమైన పనులు చేయ‌వ‌చ్చు. ఆత్మహత్య ఆలోచనల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి ఒక సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. థెరపిస్ట్ మీతో కలిసి పనిచేసి, ఆ ఆలోచనలను అధిగమించడానికి ఆరోగ్యకరమైన వ్యూహాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతారు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతుంటే, దయచేసి వెంటనే ఒక నిపుణుడిని సంప్రదించండి. అత్యవసర సహాయం కోసం, కిరణ్ హెల్ప్‌లైన్ నెంబర్: 1800-599-0019ను సంప్ర‌దించండి. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. 2022 లో దేశంలో చోటుచేసుకున్న ఆత్మ‌హ‌త్య‌ల్లో విద్యార్థుల‌వి 7.6% కాగా 2021లో అది 8.0%, 2020లో 8.2% ఉంది.

దేశంలో మొత్తం ఆత్మ‌హ‌త్య‌లు 170,924 కాగా, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌ సంఖ్య 13,044 . గత ప‌దేళ్ల‌లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల సంఖ్య 6,654 నుంచి 13,044 కి పెరిగింది. అంటే ఇది దాదాపు 64% వృద్ధి . వార్షికంగా ఇది 4% వృద్ధి రేటుతో ఉండగా, ఇది జనాభా పెరుగుదల (0.8%) నుంచీ, మొత్తం ఆత్మహత్యలకు (2%) రెండింతలు ఎక్కువ . 2021–22 మధ్యలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు 6% తగ్గగా, విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌ల సంఖ్య‌ 7% పెరిగింది. ఇటీవల జాతీయస్థాయి ఐఐటి కాలేజీలలో కూడా విద్యార్థులు తీవ్రమైన విద్యా వత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్న తీరు యావత్ భారతావనినీ విస్మయానికి గురిచేస్తుంది. సుప్రీంకోర్టు కూడా విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆత్మహత్య ఆలోచనలు తీవ్రంగా ఉన్నప్పుడు కత్తులు, పురుగుమందులు, నిద్రమాత్రలు వంటి ప్రమాదకరమైన వస్తువులను అందుబాటులో లేకుండా చేయాలి. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకుండా, వారిని నిరంతరం పర్యవేక్షించాలి. జీవితం చాలా విలువైనది. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కేవలం దాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు. అయితే వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు, భాగస్వాములు, తోబుట్టువులు మాత్రం బతికుండి ప్రతిరోజూ మరణిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఆత్మ‌హ‌త్య వంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి లేదా ఏదైనా కొండను ఎక్కి చూడండి. పెద్ద పెద్ద భవనాలు, చెట్లు ఇతర వస్తువులన్నీ చిన్న చీమల్లాగా కనిపిస్తాయి.

మీ సమస్యలు కూడా అంతే.. చాలా చిన్నవి.. అలాంటి వాటిని చూసి అస్సలు భయపడకండి. బతికి సాధించండి. గొంగళి పురుగుగానే జీవితం ముగుస్తుందని అందరం అనుకుంటే.. చివరాఖరిలో ఒక్క క్షణం అద్భుతం జరుగుతుంది. అంతే అది అప్పటినుండి అందమైన సీతాకోకచిలుకలాగా మారిపోతుంది. అలా మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు లేదా చివర్లో అయినా ఒక అద్భుత క్షణం రావచ్చు. అలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఒక్కటే జిందగీ అని ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలను ఎదుర్కొంటూ మన చుట్టూ ఉన్న వారిని సంతోష పెడుతూ మనం సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలి. విద్యార్థులు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వచ్చినట్లయితే మీరు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ 9391117100, 9440890073 ఫోన్‌ నంబర్లలో సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page