బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఏపీ కృష్ణా జలాల దోపిడీ

– శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి అక్రమంగా తరలింపు
– రోజుకు 13 టిఎంసిల నీరు తరలించుకుపోయిన ఏపి
– పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్‌ఎస్‌
-‌ చోద్యం చూస్తూ కూర్చున్న నాటి సీఎం కేసీఆర్‌
‌- కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ
– మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స‌మాధానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: బఆర్‌ఎస్‌ ‌హయాంలోనే ఏపి నీటి దోపిడీ జరిగిందని, నాటి సీఎం కేసీఆర్‌ ‌చూస్తూ ఊరుకున్నారని అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఏపి ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి అక్రమంగా నీరు తరలిస్తుంటే బీఆర్‌ఎస్‌ ‌సర్కారు చోద్యం చూసిందన్నారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 13 టీఎంసీలు తరలించుకుపోయేలా ప్రాజెక్టును విస్తరించింది. జగన్‌ ‌ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తుంటే బీఆర్‌ఎస్‌ ‌కనీసం అభ్యంతరం చెప్పలేదన్నారు. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో గొప్పగా చేశామంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు. త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రానికి ఫిర్యాదు చేసి పనులు నిలిపివేయించామ‌న్నారు. 2024-25 సీజన్‌లో కృష్ణా జలాల్లో ఎక్కువ నీటిని వాడుకున్నాం. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించి కేసీఆర్‌ ‌తీవ్ర అన్యాయం చేశారు. కృష్ణా నదీ పరివాహకం ప్రకారం మనకు అధిక వాటా రావాల్సి ఉంది. మేం వచ్చాక 550 టీఎంసీలు కావాలని వాదించాం. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఇంకా 39 వేల ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉందని ఉత్తమ్‌ ‌తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్‌ ‌మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్‌ ‌సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్‌ ‌సోర్సును మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు.  కాళేశ్వరంపై రూ.90వేల కోట్లు ఖర్చు చేసినవారు.. పాలమూరుకు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్‌ ఆన్‌ ‌చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారు. కేసీఆర్‌ ‌మోటార్‌ ఆన్‌ ‌చేసిన తెల్లారే.. మళ్లీ ఆఫ్‌ ‌చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌ ‌పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి.. పాలమూరును నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా అంచనాలు పెంచుకుంటూ పోయారు. పాలమూరులో మాత్రం 1.5 నుంచి ఒక టీఎంసీకి తగ్గించారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు తరలించే అవకాశం ఉండేది. 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునేవాళ్లం. వాటర్‌ ‌సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయింది. ఆయకట్టు కాల్వల ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డీపీఆర్‌ ‌రూపొందించారు.

ప్రాణహిత – చేవెళ్లను తుమ్మిడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారు. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తయ్యేది. 414 మీటర్ల లోతు నుంచి నీరు తీసుకొనేవాళ్లం. శ్రీశైలానికి మార్చడం వల్ల పంపుల సంఖ్య 37కి పెరిగింది. దాదాపు 560 టర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉత్తమ్‌ ‌వివరించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 512 టీఎంసీలుగా నీటి వాటాలపై బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే సంతకాలు చేశారని గుర్తుచేశారు. అంతేకాదు తెలంగాణకు కేవలం 34 శాతం నీళ్లు సరిపోతాయని కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు అంగీకరించారని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇరిగేషన్‌ ‌పేరుతో రూ.1.80 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణకు మరణశాసనం రాసినట్లయ్యిందని మంత్రి మండిపడ్డారు. బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ముందు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 783 టీఎంసీలు కేటాయించాలంటూ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోందని స్పష్టం చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 73 శాతానికి పైగా భూభాగం తెలంగాణలోనే ఉందని పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుకు రూ.83 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటికీ మట్టి, కాంక్రీట్‌ ‌పనులు మిగిలి ఉనన్నాయన్నారు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులో కేవలం 35 శాతం పనులే జరిగాయని విమర్శించారు. కుర్చీ వేసుకుని కూర్చుంటా అని కేసీఆర్‌ అన్నారని, ఆ కుర్చీ ఎక్కడ పోయిందో, కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. కృష్ణా బేసిన్‌ ‌ప్రాజెక్టులకు రూ.41 వేల కోట్లు, గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టులకు రూ.1.20 లక్షల కోట్లను గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఖర్చు పెట్టిందని ఉత్తమ్‌ ‌వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *