రైతుల విజయాలపై ప్రదర్శనలు రూపొందించాలి

– ‘రైతు నేస్తం’లో అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
– రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకనుగుణంగా రైతుల అనుభవాలు, విజయ గాథలను పొలాల నుంచే ప్రత్యక్షంగా ఇతర రైతులు చూసేలా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులతో ముఖాముఖి ముచ్చటించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు తమ వ్యవసాయ అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల వల్ల పొందుతున్న ప్రయోజనాలను మంత్రితో పంచుకున్నారు. సమగ్ర వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అంశాలపై రంగారెడ్డి జిల్లా రైతు శివ ఇతర రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. అలాగే ఇఫ్కో కంపెనీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ నానో యూరియా వినియోగం, దాని ప్రయోజనాలు, సరైన వాడక విధానంపై సమగ్రంగా వివరించారు. పీజేటీఎసఏయూ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్‌బాబు, డాక్టర్ అరుణశ్రీ యాసంగి వరిలో వచ్చే పురుగులు, తెగుళ్లు, వాటి సమర్థవంతమైన యాజమాన్యంపై వివరించారు. యూరియా యాప్ అమలుపై రైతులను మంత్రి ప్రశ్నించగా యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా, సులభంగా జరుగుతుండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూరియా లభ్యత, సమయానికి సరఫరా వంటి అంశాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం సాధిస్తున్న జగిత్యాల జిల్లా పూడూరుకి చెందిన రైతు రామకృష్ణని, అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు పొందుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు శివని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి వినూత్న వ్యవసాయ విధానాలను మరింతమంది రైతులు అనుసరించేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. కంది కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రాల వల్ల గిట్టుబాటు ధర లభిస్తోందని, మధ్యవర్తుల బెడద తగ్గిందని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతున్న తీరును, రైతులకు చేరువయ్యేలా అధికారులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. రైతుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొనేలా ముందస్తు ప్రచారం, సమన్వయం చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతు నేస్తం వేదిక మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *