– మంత్రి శ్రీధర్‌బాబుకు బ్రాహ్మణ ప్రతినిధుల విన్నపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు చైర్మన్, సభ్యులను నియమించడంతోపాటు నిధులు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్(బాస్) ప్రతినిధులు బుధవారం ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధs బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ‘బాస’ చీఫ్ కో ఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలోని కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నందిరాజు లక్ష్మీనారాయణ, అన్నావజ్జుల సూర్యప్రకాశ్, నిరంజన్ దేశాయి, మంగు రాఘవరావు, ప్రమోద్, వై.శ్రీనివారావులు తమ డిమాండ్లను శ్రీధర్‌బాబుకు వివరించారు. దేవస్థాన పాలకమండళ్లలో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి. దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలి. దేవాలయ అర్చకుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. ధూపదీప నైవేద్యం పథకాన్ని అన్ని ఆలయాలకు విస్తరించి నిధులు పెంచాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్చకులు, పేద బ్రాహ్మణులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలి. విశ్రాంత అర్చకులకు పెన్షన్ సదుపాయం కల్పించి ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికీ ఈ పథకం కింద ప్రయోజనాలు వర్తింపచేయాలి. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి. స్థానిక చదువుల కోసం ఆర్థిక సహాయం అందించాలి. నిరుద్యోగులకు ఉపాధి రుణాలు అందజేయాలి అనే ప్రధాన డిమాండ్లను ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. వారి విన్నపాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్‌బాబు వారికి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




