– అప్పుల కోసం చేసే ప్రయత్నాలే ఎక్కువ
– బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప బడ్జెట్‌లో ఒరిగిందే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదాయాన్ని పండబెట్టి.. అప్పుల కోసం అర్రులు చాచే బ్జడెట్ ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ తీవ్రంగా విమర్శించారు. ’మోసం.. దగా.. ప్రజా వంచన బ్జడెట్ ఇది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరో రూ.లక్ష కోట్ల అదనపు అప్పు భారం ప్రజలపై మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం సిగ్గు చేటని అన్నారు. రాష్టాన్ని్ర భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టిందని అన్నారు. కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకే చేయలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా నిధులు రెండు విడతలు ఎగ్గొట్టినట్లేనా అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టి కొట్టారని ఆరోపించారు. ’మహిళలను మళ్లీ వంచించారు… తులం బంగారం తుస్.. రూ.2,500లు నిల్’ అని అన్నారు. అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టారని.. రూ.4 వేల పెన్షన్ పెంపు గురించి ఊసే లేదని విమర్శించారు. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని.. బ్జడెట్‌లో నిరుద్యోగ భృతి అంశమే లేదని ఆయన అన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు అంటూ ప్రకటించినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలకు పాడె కట్టే బ్జడెట్ ఇదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి కేటాయింపుల కంటే గత బకాయిలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదించినా 8 శాతానికే పరిమితం చేశారని బండి సంజయ్ విమర్శించారు. దేవాదాయ శాఖకు గత బ్జడెట్‌లో రూ.190 కోట్లు కేటాయించినా ఈసారి ప్రస్తావనే లేదని అన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కంటి తుడుపు కేటాయింపులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 56 శాతం బీసీ జనాభాకు కేవలం 4 శాతం మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా బ్జడెట్‌లో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. మైనారిటీలకు గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ఆర్థిక మంత్రి చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో వచ్చిన పెట్టుబడుల వివరాలు వెల్లడించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని.. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ చేసిన అప్పుల భాగోతంపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





