మేము పన్నులు తగ్గిస్తే..మీరు పన్నులు పెంచుతుండ్రూ…
ఆర్‌ఆర్ టాక్స్‌తో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది
ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటులో రూ.2వేల కోట్ల భారాన్ని ఉపసంహరించుకో..
అసెంబ్లీలో రేవంత్ చెప్పేవన్నీ సుద్ధపూస మాటలేనని ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలపై అప్పుల భారాన్ని మోపారనీ, రోజు రోజూ పన్నులు పెంచుతూ ప్రజలకు షాకిస్తూనే ఉన్నారనీ, పన్నులతో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిందనీ, పన్నులు పెంచుతూ ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారనీ మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ ద్వారా దొడ్డిదారిన ప్రజలపై వేస్తున్న 2వేల కోట్ల రూపాయల భారాన్ని ఉపసంహరించుకోవల్సిందేనని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. శాసనసభ వేదికగా ప్రజలపై ఎలాంటి పన్నులుండవంటూ సుద్ధపూస మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి బయటనేమో అన్ని రకాల పన్నులను పెంచుతూ ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక ఎప్పుడు కూడా రాష్ట్ర డిఫ్లేషన్‌లోకి వెళ్లలేదనీ, కానీ రేవంత్‌రెడ్డి సిఎం అయ్యాక మాత్రం ప్రస్తుతం రాష్ట్రం డిఫ్లేషన్‌లో ఉందన్నారు. అసలే ఆర్థిక మాద్యంం ఉందనీ, తెలంగాణలో వరుసగా ఇది రెండోసారి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్నింటి మీద పన్నులు తగ్గిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం అన్నింటి మీద పన్నులను పెంచుతుండన్నారు. రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలపై అప్పులు, పన్నులు భారం తప్ప చేసిందేమీ లేదన్నారు. గత జూలై నెల, ఈ నెలలో కలిపి ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రజలై దొడ్డిదారిన 2వేల కోట్ల రూపాయల అదనపు భారం వేసినట్లు హరీష్‌రావు తెలిపారు. గతంలో 100రూపాయలు ఉన్న సర్వీస్ టాక్స్‌ను ఇప్పుడు 200రూపాయలు చేశాడనీ, వెహికిల్ సర్వీస్ టాక్స్‌ను 400రూపాయల నుంచి వన్ పర్సంటేజ్‌కు పెంచాడనీ, రోడ్ టాక్స్‌నూ పెంచాడనీ, మోటార్ సైకిల్ టాక్స్‌ను నాలుగైదు వేలకు పెంచాడనీ, గత నెలలో జరిమానల పేరిట వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారంను ప్రజలపై వేశాడన్నారు. బతుకుదెరువు కోసం వాహనాలను కొనే పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేశాడనీ, ప్రజా పాలన అంటే ఇదేనా? పేదలపై మోయలేని భారం వేయడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటే ఇదేనా?అని హరీష్‌రావు ప్రశ్నించారు. ట్రాన్స్‌పోర్టు శాఖ ద్వారా అదనంగా పేద ప్రజలపై మోపిన 2వేల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాల్సిందేనని ఆయన డిమాండు చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పన్నుల భారం వేయలేదనీ, ముఖ్యంగా రైతులు వ్యవసాయానికి ఉపయోగపడే అన్ని రకాలు యంత్రాలు, వాహనాలపై పన్నులు రద్దు చేశామన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి సిఎం అయ్యాక మాత్రం అన్ని వర్గాలపై ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల వాహనాలతో పాటు అనేక రకాలుగా పన్నుల భారాన్ని వేస్తూ ప్రజల్ని ఆర్థికంగా కోలుకోలేకుండా చేస్తున్నాడన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో ట్రాన్స్‌పోర్టులో పన్నులన్నింటిని రద్దు చేసి పేదలకు సాయం చేశామన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి పనులు మాత్రం అన్నీ రివర్స్‌గా ఉన్నాయన్నారు.రేవంత్‌రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదలపై పన్నుల భారాన్ని తగ్గించాలని, కాదు, పోదు అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగు గుణ పాఠం చెబుతారని హరీష్‌రావు హెచ్చరించారు. గతంలో రూ. 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది రూ. 6900 కోట్లు మాత్రమే వొచ్చిందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. బడ్జెట్ రూ. 8000 కోట్లు అంచనా వేశారు.. ఇదేలా సాధ్యం అని హరీష్‌రావు ప్రశ్నించారు.ఆర్ అండ్‌బి, పిఆర్‌లో అన్యూటి మోడల్‌లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి ఆ అప్పులు కడతారు.. దీన్ని ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కొనుగోలు శక్తి పెరిగితే తెలంగాణలో మాత్రం తగ్గిందనీ దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో పాలన సరిగ్గా లేకపోవడమేనని హరీష్‌రావు మండిపడ్డారు.
పండుగలొస్తే…పాపమైంది..
పంచుడు బంద్ చేసి..పెంచుడు షురూ చేసిండు…
రాష్ట్రంలో పండుగలొస్తే పాపమైందని హరీష్‌రావు అన్నారు. పండుగకు ముందు వారం, పండుగ తర్వాత వారం రోజుల పాటు ఆర్టీసీ బస్సులలో ఛార్జీలు డబుల్ చేస్తున్నారన్నారు. స్పెషల్ పేరిట ఆర్టీసీ బస్సులో భారీ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. టోల్‌గేట్ పేరుతో పాటు స్పెషల్ పేరుతో టికెట్ల ధరలను డబుల్ చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పంచుడు బంద్ చేసి పెంచుడు షురూ చేసిండన్నారు. రేపోమాపో భూముల రిజిస్ట్రేషన్ల ధరలు కూడా పెంచబోతున్నాడన్నారు. మద్యం ధరలు కూడా గణనీయంగా పెంచి రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు వైన్స్ షాపుల లైసెన్స్‌ల ధరలను పెంచడమే కాకుండా, ఊరుకో మద్యం దుకాణం తెరుస్తాడట. మండలానికో బ్రీవరిజస్‌ను ప్రారంభిస్తాడట. మండలానికో బ్రీవరిజస్ ఎందుకు అని ప్రశ్నించారు. పిల్లల్ని, విద్యార్థులతో మద్యం తాగించడానికే ఊరుకో వైన్స్ షాప్, మండలానికో బ్రీవరిజస్‌ను తెరుస్తావా?అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సిఎం అయినప్పటి నుండి దిల్లీకి మూటలు పంపించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. దిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలను ఎన్నడూ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిందనీ, ఇప్పుడు ‘ఆర్’(రోడ్డు)టాక్స్ వల్ల మరింత ఆదాయం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం పేద ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం బాగు లేదనీ, ఇప్పటికైనా పెంచిన పన్నులు తగ్గించాలనీ, ఆటిఏ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ లేదంటే ప్రజలే రేవంత్‌రెడ్డి సర్కార్ బుద్ధి చెబుతారని హరీష్‌రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, జంగిటి కనకరాజు, కొండం సంపత్‌రెడ్డి, మోహన్‌లాల్, ఎడ్ల అరవింద్‌రెడ్డి, మెరుగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.





