– గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయే
– పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని సవాల్
– 96 శాతం ప్రాజెక్టును పూర్తి చేసి టీఎంసీ నీటిని అందించిన కేసీఆర్
– మీడియాతో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనతో హుస్నాబాద్‌లకు ఒరిగిందేమీ లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. నిన్న రేవంత్ శంకుస్థాపన చేసిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ఘనత కేసీఆర్‌ది అని, 96 శాతం పనులు పూర్తిచేసి ఒక టీఎంసీ నీటిని నింపారని చెప్పారు. రిజర్వాయర్, కాలువల భూసేకరణ, నిర్మాణానికి సంబంధించి కూడా టీిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిన విషయం మర్చిపోవద్దన్నారు. కాలువలకు రూ.437 కోట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం తప్ప ఇప్పటివరకు కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో మీరేం చేశారనేది ఆలోచించుకోండన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా గండిపల్లిని సందర్శించి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి రెండేళ్లు గడిచినా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. 2014 ముందు హుస్నాబాద్ పట్టణం ఎలా ఉండేది.. అనంతరం ఎలా మారింది అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసునని, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదనడం సీఎం, మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఎలాంటి అభివృద్ధి జరగందే హుస్నాబాద్ పట్టణానికి పలుమార్లు జాతీయ అవార్డులు వచ్చాయా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. మహాసముద్రం గండి, గాడుదులలోద్ది నిర్మాణం చేసింది తామేనని, శనిగరం ప్రాజెక్టు, చెరువులు కుంటల మరమ్మతులు ఎవరు చేశారో చెప్పాలని అన్నారు. ఇది అభివృద్ధి కిందికి రాదా అని నిలదీశారు. కేవలం ఒక కళాశాలకు అనుమతులు తెచ్చి హుస్నాబాద్‌కు ఎంతో చేశామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక మంత్రిది మాటలు ఎక్కువ పనులు తక్కువ అనే చందంగా ఉన్నదన్నారు. నియోజకవర్గ ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించడంతోపాటు సాధ్యమైనంత అభివృద్ధి చేశాం తప్ప ఎన్నడూ కమీషన్లకు కక్కుర్తి పడలేదని ఆయన తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి కోసమే తప్ప సీఎం బహిరంగ సభలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. కమీషన్ల కోసమే పక్కా దవాఖాన భవనాన్ని కూల్చివేశారు. చిత్తశుద్ధి ఉంటే కొత్త భవనాన్ని మరోచోట విశాలమైన స్థలంలో నిర్మించవచ్చు కదా అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో రూ.5649 కోట్ల అభివృద్ధి, రూ.3427 కోట్ల సంక్షేమాన్ని అందించిన ఘనత మాదేనన్నారు. గౌరవెల్లి భూనిర్వాసితులను రెచ్చగొట్టి ఎకరాకు రూ.30 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పిన పొన్నం ఇప్పుడు కేవలం రూ.15 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభాకర్ ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని సంపాదన ధ్యేయంగా కాక సేవా దృక్పథంతో పనిచేయాలని సతీష్ హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





