పారిశుద్ధ్య కార్మికురాలిగా  మాజీ కార్పొరేటర్

– నగరపాలక యంత్రాంగం తీరుపై వినూత్న నిరసన

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 1 : చెత్త సమస్యను పరిష్కరించడంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలం కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు శుక్రవారం పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి వినూత్న రీతిలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. 25వ డివిజన్ లో చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు రాకపోవడంతో ప్రజలు పలుమార్లు సుమలత రాజు దృష్టికి తీసుకు రాగా ఆమె అధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేకపోవడంతో ఆమె స్వయంగా తన స్కూటీకి రెండు డబ్బాలను అమర్చుకొని చెత్త సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు 25వ డివిజన్ లో చెత్త సేకరణకు రాకపోవడంతో తానే పారిశుద్ధ్య కార్మికురాలిగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో అధికారులు పూర్తిగా కమిషన్లకు అలవాటు పడి ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం గా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి వీధులన్నీ చిత్తడిగా మారి పాములు, విషపూరిత పురుగులు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు. పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధోగతికి గురైందని, ఫాగింగ్ చేపట్టకపోవడం వల్ల దోమలు పెరిగి ప్రజలు విష జ్వరాలు, వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ లో అధికార పార్టీకి చెందిన నేతల డివిజన్లకు మాత్రమే అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. డివిజన్ అభివృద్ధి, పారిశుధ్యం విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని సుమలత హెచ్చరించారు. సుమలత రాజు చేపట్టిన ఈ వినూత్న నిరసన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *