– సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకూడదు
– తల్లుల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది
– పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు విన్న ముఖ్యమంత్రి
– వరంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
– అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: మేడారం సమ్మక్క`సారలమ్మల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడారం జాతర ప్రాంగణం, ఇతర అభివృద్ధి పనులపై మేడారంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం.. ఇది డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది.. భక్తి ఉండాలి.. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి అంటూ వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించామన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు సమ్మక్క`సారలమ్మ ఆలయం ఉంది.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సమబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధిని పూజారులు, ఆదివాసీ సంఘాలు ముక్తకంఠంతో ఏకీభవించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ఆదివాసీ సంఘాలు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన వారి జన్మ ధన్యమవుతుందని, ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిదని అన్నారు. ఆదాయం ఆశించి కాదు.. భక్తితో పనిచేయాలి.. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలి అని అధికారులకు సూచించారు. రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలని, నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులు పూర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉందని అధికారులకు, స్థానికులకు, పూజారులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి క్ష్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ విస్తరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని, అందుకనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం డిజైన్లు ఆయన విడుదల చేశారు. సమీక్షకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేడారం ఆలయ పూజారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





