– 700పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు హరీష్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. 700 పైగా వార్డుల్లో బీఆరఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదు.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని, ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయని, సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించారు. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆరఎస్ పార్టీనే అని మొన్నటి పంచాయతీ, నేటి మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. అధికారపక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని, ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు తమ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలి ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతున్న రేవంత్ సర్కారు భరతం పడుతూనే ఉంటామని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఫైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ గులాబీ జెండా ఎగరేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామని హరీష్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





