ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరూ చూశారు

– మాకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది
– ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలు నిరూపించారు
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో తమ పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో గెలవాలని పోటీ చేస్తాం.. ఈ ఎన్నిక ఎలా జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారు అని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నిక ఫలితాల అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయన్నారు. ఈ ఎన్నిక ద్వారా బీఆరెస్సే ప్రత్యామ్నాయం అని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా అనుభవం లేకున్నా మాగంటి సునీత కూడా గట్టి పోటీనిచ్చారంటూ ఆమెకు అభినందనలు తెలిపారు. దీన్ని పార్టీ సానుకూల అంశంగా పరిగణిస్తున్నదన్నారు.2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరగ్గా అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదని గుర్తు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైందన్నారు. అపుడు ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా ఇపుడు అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయం చేయలేదని, ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టామని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బూతులు మాట్లాడినా తాము హుందాగా ప్రవర్తించామన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా ఆము చేసిన అభివృద్ధిని చూపించామని, నియోజకవర్గంలో రూ.5300 కోట్ల అభివృద్ధిని చేశామని ప్రజల ముందు పెట్టామంటూ మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లమన్నారు.గ్యారెంటీల అమలుపైన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చామని పేర్కొన్నారు. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై మైనారిటీలకు స్థానం కల్పించాల్సి వచ్చిందన్నారు. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదన్నారు. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ పాల్పడిరదో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్‌ మొదలు పోలింగ్‌ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశాం. ఎలక్షన్‌ కమిషన్‌, పోలీస్‌ పనితీరుపైనా చర్చ జరగాలి. ఏది ఏమైనా ప్రజా తీర్పుని తాము గౌరవిస్తామని, ఆత్మ విమర్శ చేసుకుంటామని చెప్పారు. సింగిల్‌ డిజిట్‌తో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. ఈ ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదన్నారు. ప్రజలతోనే ఉంటాం.. ప్రజల కోసమే ఉంటాం.. తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండబెడుతున్న ప్రతి ఒక్క సోషల్‌ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. జాతీయస్థాయి కాంగ్రెస్‌ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *