– అప్పుడు కేసీఆర్ కుటుంబం
– ఇప్పుడు మంత్రులు, దళారులు
– రెండు పార్టీల దోపిడీపై విచారణ జరపాలి
– కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 :గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుంటే కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారు.. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్‌ఎస్ లేఖ రాస్తే బీఆరఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా అని ఉప ముఖ్యమంత్రి భట్టి అంటున్నారు.. సింగరేణిలో రెండు పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని మేం కోరుతున్నాం అని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతోందన్నారు. సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆరఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారు.. రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుని అప్పుల పాల్జేసింది.. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు.. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం పరిపాటి అయింది అని ఆరోపించారు. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును అసహ్యించుకుంటున్నారన్నారు. మా బాగోతం మీరు బయటపెడితే మీ బాగోతం మేం బయటపెడతామంటూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరో వారం తరువాత సింగరేణి బాగోతాన్ని దారి మళ్లించేందుకు మరో అంశాన్ని తెరపైకి తెస్తారన్నారు.
ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌లకు ప్రభుత్వం క్లీన్ చిట్ ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతున్నారు.. విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు.. ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా.. కేటీఆర్, హరీష్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు అని ప్రశ్నించారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేసినట్లే.. ఇప్పటికైనా సిట్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి.. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది అని అన్నారు. ప్రజలను దోచుకున్న కేసులన్నీ కేసీఆర్ కుటుంబానికి లొట్టపీసు కేసుల్లాగే కనిపిస్తాయన్నారు. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిచి నా ఫోన్ ట్యాప్ అయ్యిందని, మావోయిస్టు జాబితాలో నా పేరును చేర్చారని చెప్పారు.. మరి అందుకు కారకులైన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. కాంగ్రెస్ స్కాంలు బయటపడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో డ్రామాలాడుతున్నారన్నారు. కేటీఆర్ పెద్ద సంసారి అయినట్లు మాట్లాడుతున్నారు.. ఎన్ని కుటుంబాలను, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో తెలియదా.. నిజాం అరాచకాలను మరువలేదు.. నీ అరాచకాలను కూడా మర్చిపోలేం.. కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదు అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ నా చాలెంజ్‌కు సిద్ధమా అని అన్నారు. మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతోపాటు బీఆరఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను చేర్చింది నిజం కాదా అన్నారు. ఆఖరుకు కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా అని అడిగారు. సిగ్గులేకుండా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతున్నారన్నారు. నేను సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలాడతారు.. పోనీ వాటికైనా కట్టుబడి ముందుకు సాగుతారా అంటే మధ్యలోనే పారిపోతారన్నారు. సింగరేణి అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయాలని, లేనిపక్షంలో వాటిని తారుమారు చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్పిన రూ.42 వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





