అడుగడుగునా… విద్యలోనూ వివక్షతే…!

భారతీయ సమాజాన్ని వేల ఏళ్ల నాటి మను సంస్కతి  నేటికీ పీడిస్తూనే వుంది. ‘స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే వుండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి’ అనే పురుషాధిక్య భావజాలాన్ని నేడు కూడా చలామణీ చేసేందుకు మనువాదులు యత్నిస్తున్నారు. దానికి నిదర్శనమే నేటికీ కొనసాగుతోన్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తోందో తెలుపుతూ..  ‘నువ్వు ఆడదానివి, గీత దాటకూడని దానివి, మచ్చపడితే మాయని దానివి’ అంటుందని చెబుతారు అబ్బూరి ఛాయాదేవి. ఈ మచ్చలు, గీతలు స్త్రీలకే గాని పురుషులకు లేవంటుందీ సమాజం.

ఈ సమాజంలో అమ్మాయిలకు అడుగడుగునా అవరోధాలే..  వారి కదలికలపై ఎన్నో ఆంక్షలు, నిర్బంధాలు. పాప-బాబు, అమ్మాయి-అబ్బాయి, మహిళ-పురుషుడు అన్న ఈ పదాల మధ్య గీతలు చెరిపేసి, సమానం అని చెప్పాలనుకున్నా, పురుషాధిపత్య భావజాలం ఏదోఒక రూపంలో మొలకెత్తుతూనే వుంది. ఇంట్లో కనీసం ఒక్క మగపిల్లాడ్కెనా వుండాలని కోరుకునే భావన బలంగా వేళ్లూనుకుని వుంది. అమ్మాయిల్కెతే పెళ్లి  తర్వాత అత్తవారింటికి వెళ్లిపోతారు, అదే అబ్బాయిల్కెతే వృద్దాప్యంలో తమను  చూసుకుంటారని, అండగా వుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ, కొడుకు కంటే కూతురే నయమని అనుభవం చెబుతోంది. సమాజం అన్ని రంగాల్లోనూ మారుతున్నా అమ్మాయిలు- అబ్బాయిల పెంపకం విషయంలో మాత్రం పెద్దగా మారలేదు.

కుటుంబానికి స్త్రీ పురుషుల ఇద్దరి అవసరం ఉంటుంది. బండికి రెండు చక్రాల వంటి వారు. కానీ సమాజం వారిని వేరు చేసి చూస్తూంది.  ఈ తరహా విభజన ప్రాథమిక పాఠ్యాంశాల నుంచి సాహిత్యం వరకూ, సీరియళ్ల నుంచి సినిమాల వరకూ అబ్బాయిలకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే వున్నాం. విద్యలోనూ వివక్షతే. మగపిల్లలను బయట చదువులకు పంపించే తల్లిదండ్రులు ఆడపిల్లలను పంపడానికి సంకోచిస్తారు. ఎవరో ఒకరినే చదివించాల్సిన పరిస్థితివుంటే అబ్బాయిలకే ప్రాధాన్యతనిస్తారు. పిల్లల పుట్టుక దగ్గర నుంచి పెంపకం వరకూ ఈ వివక్ష అడుగడుగునా కొనసాగుతూనే వుంది. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పిండ దశలోనే అంతమొందిస్తున్నారు.  ‘జనాభా లెక్కల్లో స్త్రీలకంటే పురుషుల సంఖ్యే ఎక్కువ’ అని కేంద్ర ప్రభుత్వం గత వందేళ్లుగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా పురుషాధిపత్య భావజాల ఫలితమే. స్త్రీలను మగవారు తక్కవ చేసి చూడటం ఇంటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ముందు తల్లులు మారాలి. అమ్మాయిల పట్ల కఠినత్వం కాకుండా, మార్థవం అబ్బాయిల్లో జీర్ణించుకునేలా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అమ్మాయి, అబ్బాయి సమానమేనన్న భావన ఇంటి నుంచి, చిన్న వయసు నుంచే మొదలవ్వాలి.

అది తల్లిదండ్రుల బాధ్యత. ఇంటర్నెట్‌ యుగంలో సోషల్‌విరీడియా, ఏఐ వంటి మాధ్యమాలు అందుబాటులో వున్న నేపథ్యంలో టీనేజ్‌ పిల్లల భావోద్వేగాలను నిశితంగా గమనిస్తుండాలి. ఒకవైపు కార్పొరేటీరణ, మరోవైపు మనువాదం నేర్పిన సనాతనధర్మం పురుష మెదళ్లలో చెత్తలా పేరుకుపోతోంది. ఈ చెత్తను తొలగించే బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పాఠశాలలో ఉపాధ్యాయులది. ఇంట్లో తల్లిని, చెల్లినీ గౌరవించడం నేర్పాలి. బయటి స్త్రీలకు కూడా అంతే గౌరవ మర్యాదలివ్వాలి. పాఠ్యాం శాల్లోనూ అమ్మాయి-అబ్బాయి సమానమన్న భావన పాదుకొల్పాలి. ఆ దిశగా అబ్బాయి లను పెంచాలి. వారి మానసిక వికాసానికి తోడ్పడాలి. వంట చేయడం, ఇల్లు తుడవడం వంటివి కేవలం అమ్మాయిల పని మాత్రమే కాదు, అబ్బాయిలూ నేర్వాలన్న విజ్ఞత తల్లిదండ్రులే నేర్పాలి. ఇంటి పనంటే ఇంతులది కాదని చెప్పాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చేయాలి. అబ్బాయిల పెంపకంలో ఈ తరహా మార్పు అత్యవసరం.
  -మహేందర్‌ మిట్టపల్లి
(సీనియర్‌ జర్నలిస్ట్‌).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *