ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన వరంగల్‌ జంట

వరంగల్‌, ప్రజాతంత్ర ప్రతినిధి, నవంబర్‌ 17: హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ఈ బేస్‌ క్యాంప్‌ను ఇటీవల అధిరోహించిన 16 మంది బృందంలో వరంగల్‌ జంట ఒకటి. హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన దహగం శ్రీకాంత్‌, శారద దంపతులు తమ 55 ఏండ్ల వయస్సులో 5,364 మీటర్ల ఎత్తులోని బేస్‌ క్యాంప్‌నకు సునాయాసంగా చేరుకున్నారు. బేస్‌ క్యాంప్‌ ట్రెక్‌కు ఏటా వేలాదిమంది ఉత్సాహపడుతుంటారు. అయితే భార్యాభర్తలు కలిసి ఒకేసారి ట్రెక్‌ చేయడమన్నది చాలా అరుదు. అలాంటిది హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన ఈ జంట ఈ సాహసయాత్ర చేసింది. వృత్తిరీత్యా ముంబయిలో గో ఆఫ్ట్‌ ఫార్మా కంపెనీ సిఈవోగా పనిచేస్తున్న శ్రీకాంత్‌ తన భార్య శారదతో కలిసి గత నెల 26న ఖాట్మండ్‌ నుంచి పదిరోజుల పాటు ఈ సాహసయాత్ర జరిపారు. జీవితంలో ఒక్కసారైనా ఈ పర్వతారోహణ చేయడమన్నది ఒక అదృష్టంగా భావించాలంటారు ఆయన. బేస్‌ క్యాంప్‌ చేరకోవడం ఎంత అహ్లాదాన్ని కలిగిస్తుందో ట్రెక్‌ అన్నది అంత కఠినమైనదని, సహనం, పట్టుదల ఉన్నప్పుడే అది సాధ్యపడుతుందన్నారు. హిమాలయాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతుంటుందని, హెచ్చరిక లేకుండానే వర్షం కురుస్తుందని, క్షణాల్లో దారి కనబడకుండా పోతుందని, ఆక్సిజన్‌ స్థాయి సగానికి పడిపోతుందని తాము ఎదుర్కొన్న సంఘటనలను ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నెలలతరబడి శిక్షణ పొందాల్సి ఉంటుందని, వైద్య సంప్రదింపులు, వ్యాయామం నిరంతరంగా ఉండాలని చెప్పారు. బేస్‌ క్యాంప్‌లో ఒక రోజు గడపడమన్నది నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమన్నారు. ఇది జన్మలో మరిచిపోలేని మధుర ఘట్టమని శ్రీకాంత్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page