- సమైక్యాంధ్రలో మనం ద్వితీయ శ్రేణి పౌరులమే..
- భాష, యాసపై దాడి.. ఎగతాళి
- నిధులు, నియామకాలు, నీళ్లలో నిలువు దోపిడీ
- నేడు 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతికామన్న వాస్తవం మరువలేనిది. తెలంగాణ భాష, యాస పై దాడి చేయడమే కాకుండా ఆచార వ్యవహారాలు, సంస్కృతిల పట్ల చిన్న చూపు, ఎగతాళి చేయడం తట్టుకోలేనిదిగా మారింది. నిధులు, నియామకాలు, నీళ్లలో నిలువు దోపిడీకి గురి చేస్తూ తమ ప్రాంతానికి తరలించకపోవడం పట్ల తెలంగాణ ప్రజలు మౌనంగానే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే.. అణచివేత నుంచే తెలంగాణ గుండె గర్జించింది. అణచివేత నుండే.. వెలగని దీపం.. వెలుగు కావాలన్న ఆశ కలిగింది. మౌనం మాటలయ్యింది. అన్యాయపు నీడల కింద న్యాయపు దీపం వెలిగింది. ప్రతి అడ్డుకట్టకు, ప్రతి మోసానికి ఒక్క అడుగు ముందే వేసింది. తెలంగాణ జెండా ఎగిరింది.. నోరు మూయించిన చేతులు విరిగిపోయాయి. ఒక్కొక్క పల్లెలో “జై తెలంగాణ”గా మారింది. ఇది ఓ ప్రాంతపు గీతిక కాదు. ఇది ఓ ప్రజల గుండె చప్పుడే.. చరిత్రను మేల్కొలిపిన బలమే!
తెలంగాణ చరిత్ర గురించి సంక్షిప్తంగా..
దక్కన్ ప్రాంతంలో, కాకతీయ రాజ్యం (క్రీ.శ. 1083-1323) ప్రస్తుతం తెలంగాణ అని పిలువబడే ప్రాంతాన్ని ఆక్రమించింది. కాకతీయ రాజ్యాన్ని దిల్లీ సుల్తానేట్ ఆక్రమించిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క రాజకీయ స్వయంప్రతిపత్తి ముగిసింది. తరువాతి రెండు శతాబ్దాల కాలంలో, ఇది 1347 – 1518 మధ్య బహమనీ సుల్తానేట్‌లో ఒక ప్రావిన్స్‌గా మారింది. బహమనీ సుల్తానేట్ ఆధిపత్యం ముగిసినప్పుడు, తెలంగాణ ప్రాంతం గోల్కొండ సుల్తానేట్‌లో భాగమైంది (1518-1687). ఔరంగజేబు దండయాత్ర నేపథ్యంలో గోల్కొండ పతనంతో, ఈ ప్రాంతం మొఘల్ ప్రావిన్స్‌గా మారింది. మొఘల్ సామ్రాజ్యం రద్దుతో హైదరాబాద్ నిజాం గా ఏర్పడింది. ఇది 1720 నుంచి 1950 వరకు కొనసాగింది. ఈ కాలంలో ఈ ప్రాంతం హోదాలో వివిధ మార్పులను చూసింది. మొదట మొఘల్ చక్రవర్తికి అధికారిక అనుబంధ సంస్థగా కానీ వాస్తవానికి మరాఠా సామ్రాజ్యానికి (మొదటి నిజాం పూనాలోని మరాఠా కోర్టుకు చౌత్ పన్ను చెల్లించాడు). తర్వాత ఫ్రెంచ్ వారితో , ఆ తరువాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పొత్తు పెట్టుకున్నాడు.
చివరికి, నిజాం బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని భారతదేశ సామ్రాజ్ఞిగా, తద్వారా తన అధిపతిగా గుర్తించాడు. 1947 భారత స్వాతంత్ర్య చట్టంతో, అన్ని భారతీయ సంస్థానాలు తమ స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందాయి. దీని ప్రకారం, ఆగస్టు 15, 1947 నుండి సెప్టెంబర్ 17, 1948 వరకు, హైదరాబాద్ స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. భారత దండయాత్ర మరియు విలీనంతో స్వాతంత్ర్యం ముగిసింది. తరువాత, నిజాం హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ్ (పరిపాలనా బిరుదు)గా ఉన్నాడు. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల వరకు నిజాం రాజప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. చివరికి 1956లో హైదరాబాద్ రాష్ట్రం ముక్కలుగా విడిపోయి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనపుడు తన నామమాత్రపు పాత్రను వదులుకున్నాడు. 1956 పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిగి ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో విలీనమై ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ‘జై తెలంగాణ’ ఉద్యమం ప్రారంభమైంది. 1972 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ‘జై ఆంధ్ర’ ఉద్యమం ప్రారంభమైంది.1997 బిజెపి ఒక తీర్మానాన్ని ఆమోదించడంతో తెలంగాణ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక సంవత్సరం తరువాత, ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల నినాదం ‘ఒక ఓటు, రెండు రాష్ట్రాలు, 2001లో ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని కే. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించాలనే కేంద్రం నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ప్రకటించారు. డిసెంబర్ 23, 2009 సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేసిన తర్వాత, కేంద్రం ఆ ప్రక్రియను నిలిపివేసింది. ఫిబ్రవరి 3, 2010 ఈ సమస్యను పరిశీలించడానికి కేంద్రం ఐదుగురు సభ్యుల శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్యానెల్ డిసెంబర్‌లో నివేదికను సమర్పించి ఎంపికలను సూచిస్తుంది. జూలై 30, 2013 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించింది. అక్టోబర్ 3, 2013 ఏపీని విభజించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 5, 2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అభిప్రాయాల కోసం బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నివేదించారు. జనవరి 30, 2014 ఏపీ శాసనసభ, వాయిస్ ఓటు ద్వారా, బిల్లును తిరస్కరించింది. ఫిబ్రవరి 7, 2014 కేంద్ర మంత్రివర్గం బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 18న లోక్‌సభ బిల్లును ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2, 2014 న జరిగింది. ఇది భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది.
త్యాగాల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ..
జూన్ 2 – తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమైన రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ రోజు, రాష్ట్ర సాధన వెనుక ఉన్న పోరాటాలను గుర్తుచేసుకోవడం మన బాధ్యత. తెలంగాణ ప్రజల కల నెరవేరిన రోజు. ఈ రోజుకు ముందు ఎన్నో కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, పోలీసు లాఠీల గాయాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఉద్యోగుల నిరసనలు, రైతుల గుండెలు పగిలే హక్కుల చిత్తశుద్ధి… ఇవన్నీ కలిసి తెలంగాణకు రూపం ఇచ్చాయి. ఆ పోరాటాల్లో విశేషంగా ప్రస్తావించదగ్గది “సకల జనుల సమ్మె”.
సకల జనుల సమ్మె… అంటే అన్ని వర్గాల ప్రజలు కలిసి చేసిన సమ్మె. ఇది 2011 సెప్టెంబర్ 13న ప్రారంభమై సుమారు 42 రోజులు కొనసాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు, మేధావులు, కళాకారులు ప్రతి వర్గం ప్రజలు ఇందులో పాలుపంచుకున్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి నూతన ఊపిరినూరింది. ఈ సమ్మె ద్వారా ప్రజల సహన శక్తి, సమైక్యత, రాష్ట్ర సాధనలో వారి సంకల్ప బలం ఢిల్లీ కేంద్రానికి స్పష్టంగా తెలియజేయబడింది. రైళ్లు ఆగిపోయాయి, బస్సులు నిలిచిపోయాయి, కార్యాలయాలు బందయ్యాయి. ఇది కేవలం ఉద్యోగుల సమ్మె కాదు.. ఇది ప్రజల మనసునుంచి వచ్చిన ఉద్యమం. ఈరోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో, సకల జనుల సమ్మె లో భాగమైన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. వారి త్యాగఫలితమే మనకు ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకుంది.
విద్యార్థుల పాత్ర కీలకం….
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఊహకు అందని విషాదాన్ని మిగిల్చాయి. విశ్వవిద్యాలయాల వారైనా, గ్రామీణ యువకులైనా… “తెలంగాణ రావాలి” అనే నినాదం కోసం వందల మంది యువకులు తమ ప్రాణాలర్పించారు. ఆత్మహత్యలు కేవలం జ్ఞాపకాలుగా కాదు, ఉద్యమానికి మార్మోగే గొంతులుగా మారాయి. వారి త్యాగం పార్లమెంట్ ను కదిలించింది. విద్యార్థులు పరీక్షలు మానేశారు. రైతులు పంటలు వేసేందుకు సంకోచించారు. ఉద్యోగులు వేతనాలు లేక నిరీక్షణలో గడిపారు. కానీ ఎవరి పెదవులపైని మాట ఒక్కటే “తెలంగాణ రావాల్సిందే!”.. ఈ బాధలే ప్రజల కంట్లో ప్రతిఘాటంగా మారాయి. అవే నిరసన జ్వాలలు దిల్లీలో మారుమ్రోగాయి.
మరి లక్ష్యం చేరామా..? ప్రగతి గతి తప్పమా!
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ప్రజల ఆకాంక్షలు మూడు ప్రధాన దిశల్లో ఉన్నాయి. సమానవకాశాలు (ఉద్యోగాలు, న్యాయమైన వాటాలు), ప్రాదేశిక అభివృద్ధి, స్వీయ పాలన ద్వారా ప్రజల హక్కుల పరిరక్షణ. ఈ మూడు లక్ష్యాలను మనం గత పదేళ్ల పాలనలో ఎంతవరకు చేరుకున్నాం అనే కోణంలో విశ్లేషించాలి.
అభివృద్ధి పరంగా లాభాల విశ్లేషణ..
అధికారిక గణాంకాలు.. (2014-2025) తన రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2014 నుండి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్లలో జిడిపి రూ.4.3 లక్షల కోట్లు నుండి 13 లక్షల కోట్లు 200 శాతం పెరుగుదల. సాగు భూములకు నీరు 23 లక్షల ఎకరాలు నుండి కాలేశ్వరం తదితర ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా 65 లక్షల ఎకరాలు.. 182 శాతం పెరుగుదల. విద్యుత్ సరఫరా 6,500 మెగావాట్లు నుంచి 18,500 మెగావాట్లు 3 రెట్లు పెరుగుదల. తాగునీటి పంపిణీ 38 శాతం కుటుంబాలు 100 శాతం పైగా మిషన్ భగీరథ ద్వారా సాధ్యం. ఎఫ్‌డీఐ, పరిశ్రమలు 75,000 ఎంఎస్ఎంఈ, 2.5 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ ఉద్యోగావకాశాల్లో పెరుగుదల. గణాంకాలను పరిశీలిస్తే.. మౌలిక సదుపాయాలు, నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, పారిశ్రామిక వికాసం వంటి రంగాల్లో తెలంగాణ అనూహ్య పురోగతిని సాధించింది.
అసమానతలు, నష్టాల పర్యవేక్షణ..
నిరుద్యోగం 2014లో 10.3 శాతం నుండి ప్రస్తుతం కూడా 6.5 శాతం వద్దే నిరుద్యోగం ఉంది. టిఎస్పిఎస్సి ఉత్సవ విగ్రహంగా మారి అర్హుల కలలను తుడిచేసింది. ఉద్యోగాల భర్తీ నామమాత్రం గానే జరిగింది. ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయాయి. హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి కేంద్రీకృతం కావడంతో మిగతా జిల్లాల పరిస్థితి నామమాత్రంగానే ఉంది. ఆదిలాబాద్, భూపాలపల్లి, అశ్వారావుపేట వంటి దూర ప్రాంతాలు అదే తీరులో ఉన్నాయి. పాలనలో కేంద్రికరణ జరగకపోవడంతో స్థానిక పాలనలో స్వేచ్ఛ లేకుండా పోయింది.
ఆర్థిక భారం…
రుణ భారం 2014లో రూ. 69,000 కోట్లు వుండగా, 2025లో రూ. 8 లక్షల కోట్లు దాటింది. రైతులకు అప్పులు, విద్యుత్ సంస్థల నష్టాలు పెరిగాయి. “మా ఊర్లో రోడ్డు వొచ్చింది. కానీ మా అబ్బాయి ఉద్యోగం కోసం హైదరాబాద్ వొచ్చి ఆటో తోలుతున్నాడు” అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు ద్వారా రైతులకు సహాయంతో పాటు, రైతు బీమా ద్వారా ఐదు లక్షల బీమా ఏర్పాటు చేస్తున్నా.. పంటలకు సరియైన గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. గత ఏడాది రైతులకు రుణమాఫీ చేసినా అది నామమాత్రంగానే జరగడంతో రైతులు నిరాశ నిస్సృహాలకు లోనయ్యారు. విద్యా వ్యవస్థలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు, నాణ్యత పెరగలేదు. ప్రభుత్వ దవాఖానల్లో నర్సులు, డాక్టర్లు, ఔషధాల కొరత కొనసాగుతోంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు, నిర్మాణ రంగం, మల్టీప్లెక్స్‌లు అన్నీ హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైతున్నాయి.. తప్ప ఇతర జిల్లాల మాత్రం వెనుకబాటులోనే ఉన్నాయి. “తెలంగాణ వచ్చినప్పుడే జీవితమే మారుతుందనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరమున్నట్లు అనిపిస్తోంది.” అని ఒక నిరుద్యోగ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఒక ఆరంభం మాత్రమే. అది లక్ష్యానికి చేరిన ముగింపు కాదు. ప్రత్యేక తెలంగాణ వలన ప్రజలలో మౌలికంగా అభివృద్ధికి ఆవకాశాలు అందాయి. కానీ అది సమానంగా అందరికి చేరలేదన్నది వాస్తవం
సామాజిక తెలంగాణ ఏది?..
“సామాజిక తెలంగాణ రాలేదు” అనే మాట ఉద్యమకారులు, బహుజన సంఘాలు, దళిత, బీసీ, మైనారిటీ నేతలు తరచూ వాడుతున్నారు. దీని అర్థం ఒకవేళ భౌగోళికంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, సామాజికంగా అందరికీ సమానంగా అవకాశాలు, హక్కులు కలగలేదన్న అర్థం. పాలనా అధికారం కొన్ని కులాలోనే కేంద్రీకృతమైంది. ముఖ్యమంత్రి, స్పీకర్, అధికార పక్షం అన్ని ముఖ్యమైన పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందుతుండడం వల్ల ఇతర వర్గాలు నైతికంగా వంచితులైపోతున్నాయి. దళిత-బీసీ సామాజిక వర్గాలకు తక్కువ ప్రాతినిధ్యం. వ్యవస్థలను మార్చే స్థాయిలో నూతన విధానాలు లేకపోవడం సామాజిక లోపంగానే భావించవచ్చు. “ఇది ముఠా తెలంగాణ. ప్రజల తెలంగాణ కాదు. అధికారంలో పైవర్గాలే – కిందివర్గాల ఆశలు గాల్లో కలిశాయి.” అని సామాజిక వర్గాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక తెలంగాణ అంటే కేవలం భూభాగాన్ని విడదీయడం కాదు. అది సామాజిక న్యాయం సాధన, ప్రజాస్వామ్య విలువల ఆచరణ, అధికారంలో సమన్యాయం. తెలంగాణ సాధన మొదటి అడుగు మాత్రమే. నిజమైన సామాజిక తెలంగాణ కోసం పోరాటం ఇంకా కొనసాగుతోంది..





