-పేదవారి సంక్షేమాన్ని విస్మరించని కేసీఆర్
– నూతన విధానాలతోనే అభివృద్ధి సాధ్యం
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– అంబేడ్కర్‌కు ఘన నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో అర్థవంతమైన చర్చ జరిగిందని బీఆర్ ఎస్ నేత కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కొత్త శ్రామిక చట్టాలవల్ల కార్మికులకు జరిగే నష్టంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆ మహనీయుడు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించాం. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారు, అలాగే అత్యంత పేదరికం ఉంది. ‘ప్రపంచమే కుగ్రామం’ అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారు. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందే. ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో 3500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారు. కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది ఇరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకురాబట్టే ఫలితాలు సాధించింది. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదు. అన్నింటికీ మందు… పోరాడే పార్టీకి పార్లమెంట్‌లో తగిన సీట్లు ఇవ్వడమే. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయి. మోనోపలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగింది. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్ పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుంది. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్‌టీయూ పనిచేసినా అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, బీఆర్‌టీయూ ఎవరితోనైనా పని చేయొచ్చు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటే దేశానికి దిక్సూచి అవుతుంది. సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదాం. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దాం. లేబర్ కోడ్‌ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తాం. వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మల్లారెడ్డి, వినయ భాస్కర్, శ్రీనివాస గౌడ్, దేవి ప్రసాద్, రాంబాబు యాదవ్, మారయ్య పలు కార్మికసంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





