ఈ ఉద్యమం బీసీలందరిదీ

– బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమే
– రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్నది మోసం
– నిజాయతీగా రిజర్వేషన్లు అమలు చేసిన తమిళనాడు
– కేంద్రంలో ఎక్కువమంది ఓబీసీ మంత్రులు
– ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌
– బీజేపీ ఎంబీష ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌ ఒక పార్టీకి సంబంధించింది కాదు.. తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీలందిరిదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బంద్‌ సందర్భంగా జూబ్లీ బస్‌ స్టేషన్‌ ముందు శనివారం జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఏ పార్టీ పాలించినా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు.. ఈ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా నష్టపోతున్నాయని అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టాయి కానీ పరిష్కారం జరగలేదని తెలిపారు. తెలిసి కూడా మోసం చేయొద్దు.. బీసీల ఆత్మగౌరవంతో చెలగాటమాడొద్దని చాలామంది మేధావులు ఈ ప్రభుత్వానికి చెప్పారన్నారు. మేధావులు, న్యాయనిపుణులు ఏం చెప్పారో అదే నిజమని నిరూపితమైందన్నారు. పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. ఎన్నికలకంటే ముందు రేవంత్‌ రెడ్డి ఏం మాట్లాడారో వీడియో ఉంది చూడండి.. రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాష్ట్రాలకు లేదు.. కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది.. రాష్ట్రాల్లో చేస్తామని ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి.. మోసపోకండి అని స్వయంగా రేవంత్‌ రెడ్డి చెప్పాడు. కానీ మోసం చేశారు అని ఆయన విమర్శించారు. తమిళనాడు ఒక్కటే నిజాయతీగా రిజర్వేషన్లు అమలు చేసింది. పెరియార్‌, అన్నాదురై ఆధ్వర్యంలో అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. రాజ్యాంగం జడ పదార్థం కాదని ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు జరగాలని 21 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో రెండేళ్లపాటు బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి శాసనసభలో ఆమోదం తెలిపి ఆ రిపోర్టుతో పార్లమెంట్‌లో ఒప్పించి రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చారు. అప్పుడు కోర్టులు కూడా తప్పు పట్టలేదు, కొట్టివేయలేదు అని ఈటల వివరించారు. తెలంగాణలో కూడా కేసీఆర్‌ ఒకసారి సర్వే చేశారు. బీసీ కమిషన్‌ వేశారు. ఎన్ని కమిషన్లు వేసినా, తీర్మానాలు చేసినా అమలు కాలేదు. నిజాయతీ లేదు కాబట్టి జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేసింది తప్ప నిజాయతీ లేదు.. స్టాటిస్టికల్‌ డిపార్టుమెంట్‌తో జనాభా లెక్కలు తీశారు కానీ అవన్నీ తప్పుల తడక. 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తే బీసీ సమాజం భగ్గుమంది. ఇవన్నీ జరిగిన తర్వాత బీసీ సమాజానికి ఒక మెసేజ్‌ ఇవ్వాల్సి ఉండే. కానీ జీవోలు ఇచ్చాం.. కోర్టులు సహకరించడం లేదు.. బీజెపి సహకరించడం లేదు అని విమర్శలు చేస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంట అని సవాల్‌ చేశారు. బీసీలు మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు.. శాసించే స్థాయిలో ఉండాలి. బీసీలు అడుగుతున్నది న్యాయమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీ అయినా స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి తెలంగాణలో ఒక్క బీసీ, ఒక ట్రైబల్‌ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. వారికి ఇచ్చిన శాఖలూ చిన్నవి. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రెవెన్యూ, ఆర్థిక, హోంశాఖ వంటి పెద్ద పోర్ట్‌ఫోలియోలు ఇవ్వలేదు. దీనిపై సమాజం చర్చించాలని కోరుకుంటున్నానన్నారు. బీసీల పట్ల మొసలి కన్నీరు కాకపోతే నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆయన నిలదీశారు. బీసీలలో ఆత్మఘోష ఉంది, అంతర్మధనం ఉంది కాబట్టి తెలంగాణలో బీసీను సీఎం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారన్నారు. కేంద్ర కేబినెట్‌లో 27మంది ఓబీసీ మంత్రులున్నారు. ఒక ఓబీసీని ప్రధాని చేసిన ఘనత కూడా బీజెపిదన్నారు. మంద కృష్ణ మాదిగ పోరాటం చూసి మాదిగ రిజర్వేషన్‌ ఇస్తామని మాట ఇచ్చి అమలు చేశారు మోదీ. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో ఇక్కడా అటాగే చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు.. రాష్ట్రంలో బీసీ బంద్‌ విజయవంతం కావడం తొలిసారి. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మాత్రమే పరిమితం కాదు. చట్టసభల్లో కూడా వచ్చే వరకు ఆగదు. తాము యాచించే దగ్గర కాదు శాసించే దగ్గర ఉండాలి. మంత్రి పదవులు అడుక్కునే దగ్గర కాదు. రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దాం అని ఈటల అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *