– బెంగాల్ సర్ ప్రక్రియపై మమత అభ్యంతరం
కోల్‌కతా, జనవరి12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి వోటర్ల జాబితా డిజిటలైజేషన్ పక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన వోటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. ఎస్‌ఐఆర్ మొదలు సీఈసీకి దీదీ లేఖ రాయడం ఇది ఐదోసారి. కృత్రిమ మేధ ఆధారంగా 2002 నాటి వోటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టారు. అయితే, ఈ పక్రియ సందర్భంగా వోటర్ల వివరాల్లో తీవ్ర తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఇది కాస్తా పెద్దఎత్తున డేటా మిస్‌మ్యాచ్‌కు దారితీసింది. దీంతో నిజమైన వోటర్లు ఈ సమస్య బారిన పడ్డారు. వోటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత రెండు దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఎన్నికల సంఘం పక్కనపెట్టింది. దీంతో వోటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈసీ తన సొంత పద్ధతులను విస్మరించడం.. ఏకపక్షం, అహేతుకం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.ఎస్‌ఐఆర్ సమయంలో సమర్పించిన పత్రాలకు సరైన రసీదు ఇవ్వడం లేదు. ఈ పక్రియలోనే లోపం ఉంది. ఎస్‌ఐఆర్ విచారణ పక్రియ సైతం చాలావరకు యాంత్రికంగా, సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతోంది. సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తోందని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌లో భాగంగా 58 లక్షల మంది పేర్లను ఈసీ తొలగించిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


