– రెండు బోగీలు దగ్ధం
– ఓ బోగీలో సజీవదహనమైన ప్రయాణికుడు
– అతడి బ్యాగులో నోట్ల కట్టలు, బంగారం లభ్యం
– రైళ్ల రాకపోకల్లో ఆలస్యం – హెల్ప్ లైన్ ఏర్పాటు
విశాఖపట్నం, డిసెంబర్ 29: ఇక్కడికి 66 కి.మీ దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్టుమెంట్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఒక కోచ్‌లో 82 మంది, మరో కోచ్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని, బీ-1 కోచ్‌లో ఒకరు సజీవదహనమయ్యారని తెలిపారు. ఆయనను విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. మృతుడికి చెందిన బ్యాగులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా రూ.5.80లక్షల నగదు, బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. చాలావరకు నోట్లకట్టలు కాలిపోయి ఉన్నాయి. తెల్లవారుజామున 12:45 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దగ్ధమైన కోచ్‌లలోని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపుతామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి రెండు ఫోరెన్సిక్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లతోపాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్- చర్లపల్లి (18045), విశాఖ-లింగంపల్లి (12805), విశాఖ-గుంటూరు (17240) ఎక్స్‌రైళ్లు 3-4 గంటలు ఆలస్యమయ్యాయి. విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. యలమంచిలిలో ఆగే రైళ్లను అధికారులు విశాఖలో నియంత్రించి పంపుతున్నారు. యలమంచిలిలో స్టాప్ లేని వాటిని యథావిధిగా పంపిస్తున్నారు. వందేభారత్, జన్మభూమి సూపర్‌ఫాస్ట్ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగా బయల్దేరాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ల కోసం పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు. యలమంచిలిలో జనరల్ టికెట్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారానికి సంబంధించిన వివరాలను కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. యలమంచిలి – 7815909386, అనకాపల్లి – 7569305669, తుని – 7815909479, సామర్లకోట – 7382629990, రాజమండ్రి – 088 – 32420541, 088 – 32420543, ఏలూరు – 7569305268, విజయవాడ – 0866 – 2575167.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





