– ప్రాజెక్టు నివేదికను మూడు భాషల్లో విడుదల చేయాలి
– ఎంజేఏ డిమాండ్
– బహిరంగ లేఖ విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష, ఎటువంటి నిర్వాసితులు లేకుండా చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే మూసీ నది పరివాహక ప్రాంత పర్యావరణ రక్షణకు కూడా మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ) పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ప్రజలు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా ప్రభావితులైన వారు, కార్యకర్తలు, నిపుణులు, పర్యావరణవేత్తలు, ఆందోళన చెందుతున్న పౌరులు ముఖ్యమంత్రికి మంగళవారం ఒక బహిరంగ లేఖ ద్వారా తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ లేఖను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి (మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, మీనాక్షి నటరాజన్), అలాగే భట్టి విక్రమార్క (ఉప-ముఖ్యమంత్రి & కేబినెట్ ఉప-కమిటీ ఛైర్మన్) కు, ఎంఆర్‌డీసీఎల్ పాలక మండలికి కూడా పంపారు. మార్చి 23న శాసనసభలో మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ ఉప- కమిటీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను, అలాగే మూసీ ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమైన కుటుంబాలన్నింటినీ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న ఆయన హామీని లేఖ గుర్తించింది. అయితే నదీ పునరుజ్జీవం, నదీ పరివాహక ప్రాంత పర్యావరణ పరిరక్షణ కోసం కేబినెట్ ఉప- కమిటీ తప్పనిసరిగా శాస్త్రీయ, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను శ్రద్ధగా పరిశీలించాలని, అంతేగానీ దోషపూరితమైన రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షించడానికే పరిమితం కాకూడదని, సంతకాలు చేసిన వారు గట్టిగా పేర్కొన్నారు. అలాగే ఒక భారీ వాణిజ్య ప్రాజెక్ట్ కోసం ముందుగా నిర్వాసితులను చేసి తరువాత పునరావాసం ఇవ్వడం కంటే ప్రారంభం నుంచే భారీస్థాయి నిర్వాసితులను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా వారు కోరారు. మొత్తం ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ప్రజలకు విడుదల చేయకుండా, ‘రివర్‌ఫ్రంట్ అభివృద్ధి’ విధానాన్ని మౌలికంగా పునఃపరిశీలించకుండా, సంప్రదింపులు చేస్తున్నామనే ప్రకటనలు కేవలం పైపై మాటలు మాత్రమే అవుతాయని ఎంజేఏ స్పష్టం చేసింది. సహజ నదీ ప్రవాహాలను కాపాడే, కాలుష్యాన్ని మూలం వద్దే నియంత్రించే, వరద మైదానాలను రక్షించే, తీర ప్రాంత ప్రజల హక్కులు, జీవనోపాధులను పరిరక్షించే సామాజిక-పర్యావరణ అనుకూల నదీ పరివాహక ప్రణాళికకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాటాలకు సంఘీభావం
వ్యాపార ధోరణిలో నదీ తీరాభివృద్ధి, కాంక్రీటీకరణ, భారీ స్థాయిలో నిర్వాసితులను చేసే విధానాలకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. వివిధ బస్తీలు, కాలనీలలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాటాలకు తమ ఐక్యతను తెలిపారు. ముందస్తు ప్రజాస్వామ్య సంప్రదింపులు లేకుండానే ప్రభుత్వం మార్చి 13న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ (దశ-1)కు సంబంధించిన డీటైల్డ్ ప్రణాళికలను హడావుడిగా ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి చివరి నిమిషంలో ఆహ్వానం ఇచ్చినా ప్రజాస్వామ్య లోపాల కారణంగా ఆ కార్యక్రమంలో ఎంజేఏ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. 28న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన ద్వారా మొదటి దశ ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి అత్యవసరంగా మారిందని ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి ఆహ్వానం స్వీకరిస్తే ఈ కార్యక్రమం ఏప్రిల్ 2న జరగవచ్చని సమాచారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వార్తలను ఖండించలేదని తెలిపారు. ఈమేరకు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. మొత్తం ప్రాజెక్ట్‌కు (కేవలం దశ-1 కాదు) సంబంధించిన డ్రాఫ్ట్ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రచురించాలి. నది సరిహద్దులు, బఫర్ జోన్ వివరాలు వెల్లడించి, కనీసం 60 రోజుల పాటు ప్రజల సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలి. భూసేకరణకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్లను వెంటనే ఉపసంహరించాలి. 2017 రాష్ట్ర సవరణ చట్టాన్ని రద్దు చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని అసలు రూపంలో పునరుద్ధరించాలి. ప్రభావిత ప్రజల ప్రతినిధులు, మూసీ జన ఆందోళన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యక్ష చర్చలు జరపాలి. ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ ప్రజా విచారణలు నిర్వహించాలి. 2013 చట్టం ఉల్లంఘనలపై ఆరోపణలు, పర్యావరణ ప్రభావ అంచనాలో లోపాలను పరిశీలించే విధంగా, నదీ పరివాహక దృక్పథంతో ప్రాజెక్ట్‌ను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలను కేవలం ఎంజేఏ ప్రతినిధులు, ప్రభావిత ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు బాధ్యతాయుత స్వరాలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ ఆర్థిక శాస్త్రవేత్త లుబ్నా సర్వత్, మీనాక్షి నటరాజన్ వంటి నేతలు కూడా ప్రజలతో సంభాషణ అవసరాన్ని, 2013 చట్ట పునరుద్ధరణను, రివర్‌ఫ్రంట్ విధానాన్ని విరమించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారని తెలిపారు. మార్చి 13న తన ప్రసంగంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి నిజంగా ప్రజల అభిప్రాయాలకు స్పందిస్తారని, మూసీ తీర ప్రాంత ప్రజలతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటారని సంతకకాలు చేసిన వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, లక్షలాది ప్రజలపై పెను ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో ప్రముఖ పౌరులు, కార్యకర్తలు, పర్యావరణవేత్తలు, అధ్యాపకులు, న్యాయవాదులు, ఈ రాష్ట్రం నుంచే కాక గుజరాత్, పుణే, జమ్మూ తదితర ప్రాంతాల్లో రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడిన వారు కూడా ఉన్నారు. వీరిలో మేధా పాట్కర్, సాగర్ ధార, షబ్నం హష్మీ, ప్రొఫెసర్లు రమా మెల్కోటే, సెడ్రిక్ ప్రకాష్, డాక్టర్ వీణా శత్రుఘ్న, దొంతి నరసింహా రెడ్డి, ప్రొఫెసర్ నవదీప్ మాథుర్, డాక్టర్ జస్వీన్ జైరత్, డాక్టర్ ఎస్ సీతాలక్ష్మి, రుక్మిణీ రావు, ఎన్. వేణుగోపాల్, గౌతమ్ బందోపాధ్యాయ, పిట్టల శ్రీశైలం, డాక్టర్ లుబ్నా సర్వత్, కన్నెగంటి ఏ ప్రకాష్, రుచిత్ ఇన్సా కి ప్రకాష్, రుచిత్ ఇందు ఆషా కుమార్, డాక్టర్. దేశ్‌ముఖ్, విశాలాక్షి, ఆనంద్ రెడ్డి, ఉమాశంకరి, కళ్యాణి మీనన్ సేన్, జీవన్ కుమార్, సజయ, వి.సంధ్య, వర్గీస్ తేక్కనాథ్, సయ్యద్ బిలాల్, జాన్ మైఖేల్, అరుణ్య, ఎస్‌క్యు మసూద్, మీరా సంఘమిత్ర, అఖిల్ సూర్యతోపాటు అనేకమంది వున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




