కేర్ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన ఈఎన్‌టీ శ‌స్త్రచికిత్స‌లు స‌క్సెస్‌

– యు.ఎస్‌, ఆస్ట్రేలయా రోగుల‌కు పూర్తి స్వ‌స్థ‌త‌
– ప్ర‌మాద‌క‌ర ఈఎన్టీ స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  డిసెంబర్ 19: ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో కూడా చికిత్సలు ఫలించని అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న రోగులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు అంతర్జాతీయ రోగుల అత్యంత క్లిష్టమైన ఈఎన్టీ సమస్యలకు బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ప‌రిష్కారం చూపింది. హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్‌, విభాగాధిపతి, చీఫ్ కన్సల్టెంట్ ఈఎన్టీ, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్‌, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ ఎన్.విష్ణు స్వరూప్ రెడ్డి, ఎంఎస్ (ఈఎన్టీ), ఎఫ్ఆర్సిఎస్ (ఎడిన్‌బర్గ్), ఎఫ్ఆర్సిఎస్ (ఐర్లాండ్), డిఎల్ఓఆర్సీఎస్ (ఇంగ్లాండ్) నేతృత్వంలో నిపుణుల బృందం శ‌స్త్ర‌చికిత్స‌ల‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ కేసులు వైద్యుల శస్త్రచికిత్స నైపుణ్యాన్ని మాత్రమే కాదు.. గతంలో విఫలమైనవి, అత్యంత ప్రమాదకరమైన ఈఎన్టీ సమస్యలకు  కూడా ఖచ్చితంగా చికిత్స చేసి, దీర్ఘకాలిక మంచి ఫలితాలు అందించగల భారతీయ వైద్య వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొదటి రోగి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 35 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ నిపుణుడు. స్వదేశంలో ఇప్పటికే రెండు సార్లు ముక్కు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ అవి విఫలమవడంతో ఆయనకు తీవ్రమైన సాడిల్ నోస్ వైకల్యం ఏర్పడింది. దీంతో పాటు దీర్ఘకాలంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితిలో చికిత్స కోసం ఆయన బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌ను సంప్రదించాడు. వైద్యుల పరిశీలనలో ముక్కు లోపలి మద్దతు పూర్తిగా కోల్పోయినట్టు తేలింది. దీంతో డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి, రోగి స్వంత కణజాలాన్ని ఉపయోగించి క్లిష్టమైన పక్కటెముక మృదులాస్థి పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిర్వహించారు. దీని ద్వారా ముక్కు ఆకారంతో పాటు దాని పనితీరును కూడా పూర్తిగా పునరుద్ధరించారు. రోగి పరిమిత బసను దృష్టిలో పెట్టుకుని, సంప్రదింపులు జరిగిన 48 గంటల్లోనే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన శ్వాస తీసుకోవడంలోనూ, రూపంలోనూ గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఫలితంతో పూర్తిగా సంతృప్తి చెందిన రోగి ఉపశమనంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఇంకొక రోగి అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన 30 ఏళ్ల యువ ప్రొఫెషనల్. ఆయనకు రెండు చెవుల్లోనూ తీవ్రమైన వినికిడి లోపం ఉండేది. కాలిఫోర్నియాలో కుడి చెవికి చేయించిన శస్త్రచికిత్స విఫలమైన తర్వాత, ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించాడు. వినికిడి పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్) ఉపయోగించినప్పటికీ స్పష్టంగా వినిపించకపోవడంతో వాటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరీక్షల్లో ఆయనకు ‘ద్వైపాక్షిక ఓటోస్క్లెరోసిస్’ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత ఇంతకుముందు శస్త్రచికిత్స చేయని ఎడమ చెవికి మత్తులో స్టెపెడోటమీ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స పూర్తయ్యిన వెంటనే ఆపరేషన్ టేబుల్‌పైనే ఆయనకు సాధారణ వినికిడి తిరిగి వచ్చింది. ఈ ఫలితంతో ధైర్యం వచ్చిన డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి, అమెరికాలో గతంలో విఫలమైన కుడి చెవిపై సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడిన రివిజన్ స్టెపెడోటమీ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఈ శస్త్రచికిత్స ద్వారా కుడి చెవిలో కూడా వినికిడి పూర్తిగా పునరుద్ధరించారు. రివిజన్ స్టెపెడోటమీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ ఓటాలజిస్ట్‌కైనా (మైక్రో ఇయర్ సర్జన్) అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలలో ఒకటిగా భావిస్తారు. రెండు చెవుల్లోనూ సాధారణ వినికిడి తిరిగి రావడంతో, వినికిడి పరికరాల అవసరం లేకుండా రోగి ఆనందంగా అమెరికాకు తిరిగి వెళ్లాడు. ఇది ఆయన జీవన నాణ్యతలో పూర్తిస్థాయి మార్పుకు నిదర్శనంగా నిలిచింది. ఈ కేసుల ప్రాముఖ్యతపై డాక్టర్ ఎన్. విష్ణు స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ, “నేను పదేళ్లకు పైగా ఇంగ్లాండ్‌లో పనిచేశాను. యూకే, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ (పారిస్), ఆస్ట్రియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అత్యాధునిక శస్త్రచికిత్సలపై ప్రత్యేక శిక్షణ పొందాను. అయితే, భారతదేశంలో ఎదురయ్యే క్లిష్ట కేసుల సంఖ్య, వాటిలో కనిపించే వైవిధ్యం మాత్రం నిజంగా ఎక్కడా చూడని స్థాయిలో ఉంటుంది” అని తెలిపారు. భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉండటం వల్ల, ఇక్కడి సర్జన్లకు విస్తృతమైన వైద్య అనుభవం లభిస్తుంది. ఈ స్థాయి అనుభవం అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అరుదుగా కనిపిస్తుంది. అందువల్ల ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అత్యంత క్లిష్టమైన కేసులనూ ఖచ్చితంగా, స్థిరంగా, నమ్మదగిన ఫలితాలతో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం మన వైద్యులకు ఉంటుంది. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, “ఏళ్ల తరబడి బాధతో పోరాడిన ఈ రోగులు మాపై ఉంచిన నమ్మకం, ఒక ప్రముఖ ఆసుపత్రిగా మేము మోస్తున్న బాధ్యతను మరింత పెంచుతోంది. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి  అద్భుతమైన నాయకత్వంలో కేర్ బంజారా హిల్స్, క్లిష్టమైన ఈఎన్‌టి శస్త్రచికిత్సలకు ముఖ్య కేంద్రంగా ఎదుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇదే దిశలో మా సేవలను మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతాము” అని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *