ఇదొక చెత్త కేసుగా అభివర్ణించిన కెటిఆర్
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి )
రాష్ట్ర ప్రజల ఏడుగంటల ఉత్కంఠకు ఎట్టకేలకు సాయంత్రం తెరపడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య గురువారం ఏసిబి ఎదుట హాజరుకావడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంగీకరించింది మొదలు ఆయన చిరునవ్వుతో ఏసిబి కార్యాలయం నుంచి బయటికి వొచ్చే వరకు యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురుచూసింది. ముఖ్యంగా బిఆర్‌ఎస్ శ్రేణులకు ఊపిరి తీసుకున్నట్లయింది. విచారణకు రావాల్సిందిగా కెటిఆర్‌కు ఏసిబి నోటీసు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయంపై అనేక చర్చోపచర్చలు చోటుచేసుకున్నాయి. విచారణ కోసం పిలిచిన ఎసిబి కెటిఆర్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారం విసృతంగా జరగటంతో అటు పార్టీ శ్రేణులతో పాటు, ప్రజల్లోకూడా ఈ విషయంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
దానికి తగినట్లు ఇది ఒక చెత్త కేసుగా మొదటి నుంచీ చెబుతున్న కెటిఆర్, ఎలాంటి అవినీతి ఆధారాలులేని ఈ కేసును కొట్టివేయాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పాటు విచారణ సందర్భంగా అరెస్టు చేయకుండా ఉండేందుకు కోర్టుకు వెళ్లడం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. అయితే ఎసిబి ఇచ్చిన నోటీసుతో కోర్టు ఆదేశాలనుసారం తన లాయర్‌తో గురువారం బంజారాహిల్స్‌లోని ఎసిబి కార్యాలయానికి సుమారు 11 గంటలకు చేరుకున్నప్పటి నుంచి పార్టీ శ్రేణులు, అభిమానుల్లో విపరీతమైన టెన్షన్ మొదలైంది. ఒకవేళ అరెస్టు చేస్తున్నట్లు ఏసిబి పేర్కొన్న పక్షంలో ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని గత రెండు రోజులుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కానీ, వారి ఆందోళనకు తెర దించుతూ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కెటిఆర్ నవ్వు ముఖంతో ఏసిబీ కార్యాలయం నుంచి బయటికి రావడంతో అనుచరవర్గం ఊపిరి తీసుకుని.
ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబందించి అనేక అవకతవకలు జరిగాయని కెటిఆర్‌పై మోపిన అభియోగం. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలను ఎలా చెల్లించారన్నది అందులో ప్రధానాంశం. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులను ఎసిబి ప్రశ్నించింది. హెచ్‌ఎండిఏ అధికారి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవిందకుమార్, హెచ్‌ఎండిఏ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కెటిఆర్‌ను గురువారం ఏసిబి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసిబి జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షణలో ఏసిబి డిఎస్‌పి మజాద్‌ఖాన్ మరికొందరు అధికారులు కెటిఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. సుమారు ఏడు గంటలపాటు జరిగిన ఈ దర్యాప్తు అనంతరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కెటిఆర్ ఏసిబి కార్యాలయం నుంచి బయటకు వొచ్చారు. కార్యాలయం బయటికి రాగానే అక్కడున్న మీడియాతో మరోసారి తనపై మోపింది చెత్త కేసని, అదే విషయాన్ని తాను ఏసిబి అధికారులతో చెప్పినట్లు పేర్కొన్నారు.
అయినా అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తనకు తెలిసినంత వరకు, అవగాహన ఉన్నంతవరకు సంతృప్తిగానే సమాధానమిచ్చి నట్లు తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడితో నిరాధార కేసును తనపై ప్రయోగించారని, దీనివల్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమీ సాధించలేదన్నారు. మీడియాలో చెక్కర్లు కొడుతున్న అవే నాలుగు ప్రశ్నలను నలభై సార్లు అడిగారని, అవి కూడా రేవంత్ రాసిచ్చినవేనంటూ ఆయన విమర్శించారు. తాము ఏ సంస్థకైతే డబ్బు చెల్లించామంటున్నారో, ఆ సంస్థ ఆ డబ్బును తమ ఖాతాలో జమ చూపిస్తున్నప్పుడు ఇక అవినీతికి తావెక్కడిదని తాను ఏసిబి అధికారులకు ఎదురు ప్రశ్నవేసిన విషయాన్ని తెలుపుతూ, రాజకీయ ప్రేరేపిత ఈ కేసుకు సంబంధించి అధికారులు ఎన్నిసార్లు పిలిచినా హాజరవడానికి తాను సిద్దంగానే ఉన్నానన్నారు. కాగా విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి తెలివితేటలు కాంగ్రెస్ సొంతమని, రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చేసిన యత్నాలను, అయిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడం లాంటి పనులు తమకు చాతకావని సెటైర్లు వేశారు. తమపై ఎన్నికేసులు పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరేవేర్చేవరకు తెలంగాణ బిడ్డగా, రాష్ట్రం కోసం పోరాటం చేసిన సైనికుడిగా ప్రజలపక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.





