– మట్టి నింపి ఆక్రమించిన భూమి స్వాధీనం
– హైడ్రా చర్యలతో స్థానికుల హర్షం
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్ కార్యాలయం- మదీనగూడ మార్గంలో జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 134 పరిధిలో ఉన్న జంగమోనికుంటను పూర్తిగా మాయం చేస్తూ.. ఆక్రమణదారులు మట్టితో నింపి చదును చేసినట్లు అధికారులు గుర్తించారు. జంగమోనికుంట చెరువును నాశనం చేసి భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ అక్రమాలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. హైడ్రా బృందం రెవెన్యూ అధికారులతో కలిసి జంగమోనికుంట వద్ద జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి, భూమి స్థితిగతులను పూర్తిగా పరిశీలించింది. అక్రమ కబ్జాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసుల సహకారంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను హైడ్రా సిబ్బంది ప్రారంభించింది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, జల వనరులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రాపై ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



