– స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పెద్ద మొత్తంలో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మోమిన్ పేట్ మండలం నందివాగు చెరువులో చేప పిల్లల విడుదల, మండల కేంద్రంలోని 48 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, దేవరంపల్లి చక్రంపల్లి గ్రామాల్లో రూ.3 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో సభాపతి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చెరువులలో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదిలే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదని, చెరువుల్లో ఎన్ని చేపలు వదిలారో కూడా లెక్కలు లేవని అన్నారు. జిల్లాలో కోటి 29 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, దీనికి రూ.కోటి 7 లక్షలను వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు. నంది వాగు చెరువులో లక్ష 92 వేల చేప పిల్లలను వదలడం జరుగుతుందని సభాపతి తెలిపారు. మత్స్య సహకార సంఘ భవనాలకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతోపాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చే స్తున్నట్లు, సన్న బియ్యం ఇవ్వడంతోపాటు రేషన్ కార్డులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఆడపడచును గౌరవించుకునే విధంగా నాణ్యమైన చీరలను అందీస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. రోడ్ల నిర్మాణానికి ఆర్ అండ్ బి ద్వారా రూ.554 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా రూ.160 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టినట్లు సభాపతి గుర్తు చేశారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మహిళా మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రతి మత్స్య సహకార సంఘంలో వందకు 100 సభ్యత్వం కలిగి ఉండాలని సూచించారు. సంఘంలో ఉన్న సభ్యులు అకాల మరణం చెందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7 లక్షల పరిహారం అందిస్తాయని తెలిపారు. మత్స్య సహకార సంఘాలకు స్వంత భవనాలు ఉండేవిధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి, మండల ప్రత్యేక అధికారి సదానందం, బీసీ సంక్షేమ అధికారి మాధవరెడ్డి, తహసిల్దార్ రవిందర్ఎం, పీడీఓ సృజన, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, నందీవాగు చెరువు చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




