కీలక ముందడుగు

– అనాధల ఉపాధిలో ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యానికి శ్రీకారం
– ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమి, ఫిక్కి ఒప్పందాలు
– అంగడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ పాఠాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనాధ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అంగన్‌వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సమక్షంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పలు కీలక అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకుంది. అనాథ పిల్లలకు భరోసా కల్పిస్తూ వారికి ఆశ్రయం మాత్రమే కాదు.. భవిష్యత్తు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సదన్‌లో ఉంటున్న అనాధ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు జీఎమ్మార్ ఏరో అకాడమితో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం 2026 మార్చి నుంచి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి ప్రైవేట్, అంతర్జాతీయస్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం. మొదటి విడతలో 20మందికి శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాత బ్యాచ్‌ల వారీగా అర్హులందరికీ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ హెడ్ కె.అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా హాజరయ్యారు.

ఫిక్కి-ఫ్లోతో డిజిటల్ అండ్ ఇండస్ట్రీ నైపుణ్యాలు

పాలిటెక్నిక్ చదువుతున్న అనాధ బాలికలకు ఇండస్ట్రీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీ లేడీిస్ అర్గనైజేషన్‌తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుంది. స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్, అవినాష్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఈ సర్టిఫైడ్ కోర్సులు అనాధ బాలికలకు చెప్పిస్తారు. క్లాస్ రూం టుం కార్పొరేట్ జాబ్ లక్ష్యంగా 30 గంటల శిక్షణ మాడ్యూల్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దనున్నారు. మొత్తం 300మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మంచి ఉద్యోగాలు లభించేలా చేయనున్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతోపాటు ఫిక్కి లేడీస్ అర్గనైజేషన్ చైర్‌పర్సన్ ప్రతిభా కుందా, స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్ ప్రాచి త్రివేది షా, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్లకు 6 నెలల సర్టిఫికెట్ కోర్సు

అంగన్‌వాడీ సేవలను బలోపేతం చేయడానికి అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీతో కలిసి ఆరు నెలల ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సు అమలు చేయనున్నారు. ఎర్ల్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అంగన్‌వాడీ టీచర్లందరికీ ఈ మోడల్ ద్వారా శిక్షణ ఇస్తారు. 30 గంటల ఆన్‌లైన్ సెషన్లు, ఆరు రోజుల ప్రత్యక్ష శిక్షణ కలిపి ఆరు నెలల వ్యవధిలో కోర్సు పూర్తి అవుతుంది. విజయవంతంగా పూర్తి చేసిన వారికి అజీమ్ ప్రేమ్ జీ యూTనివర్సిటీ సర్టిఫికెట్ అందిస్తుంది. టీచింగ్, కేరింగ్, పిల్లల బోధనలో సామర్థ్య పెంపు ఈ శిక్షణలో ప్రధానాంశాలు. మారుతున్న అవసరాలÅ£నుగుణంగా అంగన్‌వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 3-6 సంవత్సరాల చిన్నారుల పాఠశాల సంసిద్ధతను మెరుగుపరచడమే లక్షంగా ఈ కోర్సు పనిచేయనుంది. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతోపాటు అజీమ్ ప్రెమ్ జీ ఫౌండేషన్ తెలంగాణ హెడ్ ఎం.శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు.

అనాధలకు భవిష్యత్తు కల్పించడం ప్రభుత్వ లక్షం: మంత్రి సీతక్క

పలు ఒప్పందాల సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. వారికి కేవలం ఆశ్రయం కాదు.. భవిష్యత్తు కల్పించడమే మా లక్ష్యం.. పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు. మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలతో రూపొందించిన ఈ కార్యక్రమాలు ప్రభుత్వం-పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాధ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *