ఉద్యోగుల సంక్షేమం మా బాధ్య‌త‌

– మొద‌టి తేదీనే జీతాలు ఇస్తున్నాం
– మెడిక‌ల్‌, స‌ప్ల‌మెంట‌రీ సాల‌రీ బ‌కాయిలు క్లియ‌ర్‌
– పెండింగ్ బిల్లులు త్వరలో క్లియర్ చేస్తాం
– గృహజ్యోతి పథకంతో 52.82 లక్షల మందికి లబ్ధి

– శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2: గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచినప్పటికీ త‌మ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం స‌భ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సందర్భంగా పెండింగ్ బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 18వ తేదీకి జీతాలు చెల్లించి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. త‌మ‌ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్న‌ద‌ని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నెలాఖరు నుంచి మొదటి తేదీన జీతాలు చెల్లించడమే పెద్ద విషయమని, దీనివల్ల ఉద్యోగులు అధిక వడ్డీలతో ప్రైవేటు రుణాలకు పోకుండా కాపాడ‌గ‌లుగుతున్నామ‌ని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.మెడికల్ బిల్లులు రూ.200 కోట్ల మేర, సప్లిమెంటరీ శాలరీ బకాయిలు రూ.560 కోట్లు పూర్తిగా క్లియర్ చేశామని, ఇకపై నెలవారీగా క్లియర్ చేస్తామని వివ‌రించారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు ఆర్థిక భారాన్ని వాయిదా వేయడమేనని విమర్శించారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంచకపోయి ఉంటే వాస్తవంగా 2021 నుంచి 2023 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది పదవి విరమణ పొందాలి కానీ వయోపరిమితి పెంపుతో 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని తెలిపారు. ఆనాడు వాస్తవాలు తెలియక కొంతమంది పాలాభిషేకాలు చేశారన్నారు.
2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం మాకు వివిధ రకాల బకాయిల కింద రూ.43,154 కోట్లు బిల్స్ పెండింగ్ లో పెట్టి వెళ్లిపోయింది.. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే రూ.4,575 కోట్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని ఆర్థిక శ్వేత పత్రంలో సైతం వివరించామని తెలిపారు. త‌మ ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్స్ రూ.1,752 కోట్ల చెల్లించాము.. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.6,244 కోట్లు ఉన్నాయి .. ప్రాధాన్యత క్రమంలో ప్రతినెలా ఇబ్బంది లేకుండా చెల్లిస్తూన్నామని తెలిపారు. ప్రతినెలా అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు రూ.700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి వారే హెల్త్ స్కీమ్ డిజైన్ చేసుకోవాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మెడికల్ బిల్లులు పెండింగ్ లో పెట్టడం అమానవీయ అంశంగా మా ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.200 కోట్ల పైన మెడికల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చేశాం, ఇకనుంచి ఏ నెలకు ఆ నెల బిల్లులు, సప్లమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని భట్టి తెలిపారు.

గృహజ్యోతి పథకంలో 3,593 కోట్లు

కాగా, గృహజ్యోతి పథకం ద్వారా 52,82,498 మంది లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వీరి పక్షంగా రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించామని వివరించారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరణ ఇచ్చారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 25,35,560, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 27,46,938 మంది లబ్ధిదారులు ఉన్నారని. ఈ పథకం ద్వారా 52 ,82 ,498 లక్షల కుటుంబాలకు రూ.3,593.17 కోట్లు ఆదా అవడం మూలంగా వారు సామాజికంగా, ఆరోగ్యకరంగా, ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లలను మంచి చదువులు చదివించుకునేందుకు ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *