మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం
– కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎసఏ) క్యాలెండర్, డైరీని సచివాలయంలో ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను అభినందించారు. జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయి దూరప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేళ్లపాటు అంతర్ జిల్లా డెప్యుటేషన్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. జీవో ప్రతులను మంత్రి సీతక్క చేతుల మీదుగా స్వీకరించిన కార్యదర్శులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి అంతర్ జిల్లా డెప్యుటేషన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అంతర్ జిల్లా డెప్యుటేషన్లకు అనుమతులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కృషి వల్లే జీవో నెం.317లో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా పంచాయతీరాజ్ శాఖ ముందంజలో నిలిచిందని కొనియాడారు. కార్యక్రమంలో టీపీఎసఏ అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీనివాస్, ట్రెజరర్ జె.పండరినాథ్, ఉపాధ్యక్షుడు సి.నాగేశ్, అర్గనైజింగ్ సెక్రటరి బి.సురేష్ గౌడ్, ఈసీ సభ్యులు ఎం.కవితాదేవి, ఆర్.వేణు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *