వ్య‌వ‌సాయానికి 12 గంట‌లే విద్యుత్ స‌ర‌ఫ‌రా

– ఇందులోనూ ఐదుసార్లు ట్రిప్‌లు
– ప్ర‌భుత్వం చెబుతున్న 24 గంట‌ల స‌ర‌ఫ‌రా ఎక్క‌డ‌?
– రైతులంటే ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు
– వెంట‌నే రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాలి
– బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌

జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:కోహిర్‌లో విద్యుత్ సరఫరా బాగాలేదు.. రోజుకు 5–6 సార్లు ట్రిప్ అవుతుంది.. రైతులకు వ్యవసాయానికి 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది.. ఆ ఇచ్చిన కరెంట్ నాలుగుసార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. కొద్ది రోజులుగా రైతులు ఎమ్మెల్యే మాణిక్యరావుకు, నాకు కూడా ఫోన్ చేసి చెబుతున్నార‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు అన్నారు. గురువారం ఆయ‌న జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం, కోహిర్ మండ‌లం డిగ్వాల్ స‌బ్ స్టేష‌న్‌ను ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్పుడే లాగ్‌బుక్ చూశాం. పదో తేదీ సాయంత్రం 4 గంటలకు త్రీఫేస్ కరెంట్ తీసేశారు. మళ్లీ 11న ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే దాదాపు 11 గంటలపాటు కరెంట్ తీసేశారు. ఇది నేను చెబుతున్నది కాదు.. స్వయంగా మీ లాగ్‌బుక్ చెబుతున్నవివ‌రాల‌న్నారు. మిగతా 13 గంటలు చూస్తే ఎల్‌సి ఉన్నది, లైన్ బ్రేక్ అయిందంటున్నారు. అట్లా మళ్లీ ఐదుసార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు ఐదుసార్లు ట్రిప్ అవుతుంది. దానివల్ల పారిన మడికే నీరు పారుతుంది. వెనుక మడికి నీళ్లు అందని పరిస్థితి వస్తుందని రైతులు బాధపడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. మరి ఎక్కడ ఉంది 24 గంటల కరెంట్? లాగ్‌బుక్‌లో 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్‌సి, లైన్ బ్రేక్, ట్రిప్పులు ఇవన్నీ తీసేస్తే 12 గంటలు కరెంట్ కూడా రైతులకు రావడం లేదు. ఆ ఇచ్చిన కరెంట్ నాలుగుసార్లు రైతులకు ట్రిప్ అవుతున్న‌ద‌న్నారు. ముఖ్య‌మంత్రికి రైతులంటే ఎందుకింత చిన్న‌చూపు అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ వస్తే, ఇవాళ 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇవాళ నువ్వు రైతులకు ఏం చేశావు? రైతులకు రైతుబంధు కొట్టినవ్, పంటల బీమా, ఆత్మీయ భరోసా కొట్టినవ్, బోనస్ పోయిన యాసంగికి ఇవ్వలేదు. రైతులకు కరెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు. రైతుల్ని ఇవాళ ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నావు రేవంత్ రెడ్డి అని ప్ర‌శ్నించారు. ఇవాళ స్పష్టంగా దిగ్వాల్ సబ్‌స్టేషన్‌లో చూస్తే రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇప్పటివరకు రైతుబంధు పడలేదు. పోయిన యాసంగి పంటలకు లేదు. వరంగల్‌లో వాన పరిహారం కూడా రెండు సంవత్సరాలుగా రావడం లేదు. రైతుల మీద ఎందుకు ఇంత చిన్నచూపు రేవంత్ రెడ్డి? రైతుల మీద ఎందుకు ఇంత పగ అన్నారు. బాధ కలిగించే అంశం ఏంటంటేకేసీఆర్ ఉన్నప్పుడు రూ.4900కు వ్యవసాయ కనెక్షన్ ఇచ్చేవారు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డబుల్ అంటే రూ.9700 చేశారు. మాటల్లో రైతు ప్రభుత్వం, చేతల్లో రైతు వ్యతిరేక ప్రభుత్వం.

వేలాది విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌

రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కనెక్షన్లు రిలీజ్ చేయడంలో కూడా ఆలస్యం జరుగుతున్న‌ది. స్టోర్‌లో మెటీరియల్ లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు రైతుల మీదనే భారం పడుతున్న‌ది. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడం లేదు. లో వోల్టేజ్ ఉన్నచోట అదనపు డీటీఆర్ పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని ఆరోపించారు. దమ్ముంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. లేదంటే చెంపలు వేసుకుని తప్పు అయిందని, మేము 24 గంటల కరెంట్ ఇవ్వలేము, 12 గంటలే ఇస్తాం అని చెప్పండ‌ని డిమాండ్ చేశారు. నిజంగా 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఉంటే రేపటి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. మూడో డిస్కం పెట్టింది ఎందుకంటే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో కొత్త అప్పుల కోసం. ఉన్న బకాయిలన్నీ థర్డ్ డిస్కం‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో అప్పు లేదని చూపించి మళ్లీ కొత్త అప్పులు తెచ్చే నాటకం ఆడుతున్నారన్నారు. డిస్కం ఎలా పనిచేస్తుంది అంటే ఒక గ్రామం ఉంటే అందులో ఇండ్లు ఒక ఏఈ , వ్యవసాయ బావులకు ఒక ఏఈ. ఇది ప్రాక్టికల్‌గా జరిగే పని కాదు. కేవలం బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను మోసపుచ్చడానికి ఈ డిస్కం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మీరు డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. 55 వేల కోట్లు డిస్కంలు అప్పుల్లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా డిస్కంలకు ఉచిత విద్యుత్ గానీ, 200 యూనిట్ల గానీ ప్రభుత్వం చెల్లించడం లేదు. 6 నెలల నుండి కొత్త మీటర్లు ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 19,647 మంది ఆర్టీజెన్స్ సమ్మె చేస్తున్నారు. వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. చనిపోయిన ఆర్టీజెన్స్ పిల్లలకు వారి విద్యా అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్పీడీసీఎల్‌లో అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. రైతులకు ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ రావడం లేదు. వస్తున్నది కేవలం 12 గంటల కరెంట్ మాత్రమేన‌న్నారు. నర్సాపూర్, మెదక్ సబ్‌స్టేషన్‌లో కూడా 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకా కోహీర్ మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌లో కూడా 12 గంటల కరెంట్ మాత్రమే వస్తోంది. ఏ విషయంలో కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. టీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ గారి పాలనలో రైతుబంధు బరాబర్ ఇచ్చాం. కరోనా సమయంలో కూడా ఇచ్చాం. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి నువ్వు రైతులను మోసం చేశావు, రైతులను దగా చేశావన్నారు. వెంటనే రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేయాలి, ఇండ్లకు డబ్బులు కట్టిన వారికి వెంటనే మీటర్లు పెట్టాలి, రైతుబంధు వెంటనే విడుదల చేయాలి, ఆర్టీజెన్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి అని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *