– గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు
– భవిష్యత్ తరాలకు మేలుచేసే చర్యలు
-ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తికి చర్యలు
– ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మొయినాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాదులో సోమవారం సబ్ స్టేషన్లకు శంకుస్థాపన, రేషన్ కార్డులు, రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రీన్ పవర్ ఉత్పత్తికి భారీ ప్రణాళికలు పన్ను భారం మోపకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కు మేలు చేసే విధంగా విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నదన్నారు. 2047 నాటికి పెరిగే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నామన్నారు. అందుకు సంభందించిన సమాచారన్ని పంపాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో వందకు వందశాతము సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దేవాదాయ, ఇరిగేషన్ , మరే ఇతరమైన ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటి సమాచారాన్ని పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై కూడా ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. హైడల్, పుంప్డ్ స్టోరేజ్, పవన విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్ ఉత్పాదన చేయడం ఒక భాగమైతే విద్యుత్ ను సరఫరా చేయడం మరో భాగమన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను అనుగుణంగా సరఫరా లోడ్ ని నియంత్రించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ లను పెంచుకోవడం, అప్ గ్రేడ్ చేయడం, ట్రాన్స్ఫార్మర్లను పెంచుకోవడం చేస్తున్నామన్నారు. రెప్పపాటు కాలం పాటు విద్యుత్ పోకుండా చూస్తున్న విద్యుత్ శాఖ అధికారులు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఈ శాఖ ఉద్యోగుల, కార్మికులకు సింగరేణిలో మాదిరిగానే రూ.కోటి ప్రమాద భీమా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఒకేసారి రూ. 20 కోట్లకు పైబడిన నిధులతో నిర్మించతలపెట్టిన మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గానికి 5 షబ్ స్టేషన్లు మంజూరుచేస్తే ఇప్పటికే రెండు షబ్ స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయన్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా 132 కేవీ సబ్ స్టేషన్ కు ఏర్పాటుకు అవసరమైన డిమాండ్ ను స్టడీ చేసి నివేదికను విద్యుత్ అధికారులు వెంటనే పంపాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని అందిస్తున్నాం. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కార్డులో ఎంతమంది ఉంటే ఎంతమందికి సన్నబియ్యాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలకి ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.లక్ష కోట్లను ఖర్చు చేసిందన్నారు. కొత్తగా పన్నులు వేయకుండా మనకున్న ఆదాయంతోనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్‌పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి,కాంగ్రెస్ నాయకులు భీమ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.





