రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట

– రూ.179 కోట్లు చెల్లించాలన్న సీఈఆర్సీ నోటీసులపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిల చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో వెసులుబాటు లభించింది. విద్యుత్తు సరఫరాలో లోటుకు రూ.179 కోట్లు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్సీ) ఇచ్చిన నోటీసు అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. విద్యుత్‌ సరఫరాలో తేడా వల్ల విధించే తాజా చార్జీలను చెల్లించాలంది. సరఫరాలో హెచ్చు తగ్గులను సమన్వయం చేస్తూ గ్రిడ్‌కు అదనపు విద్యుత్తు అందించినందుకు రూ.179 కోట్లు బకాయిలు చెల్లించాలని సీఈఆర్సీ సుమోటోగా తీసుకుని ఉత్తర్వులిచ్చింది. దీనిని రద్దు చేయాలంటూ ఎస్పీడీసీఎల్‌, ఎన్సీడీసీఎల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ పి.శ్యాంకోశీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్సీ) ఇచ్చిన నోటీసు అమలును తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ రెగ్యులేటరీ నిబంధనలు 2024 సెప్టెంబర్‌ 16 నుంచి అమల్లోకి వచ్చాయని, అంతకంటే ముందునాటి బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం చెల్లదని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో కలిపి మొత్తం బకాయిలు రూ.190 కోట్లు ఉండగా అందులో రూ.170 కోట్లు చెల్లించాలని సీఈఆర్సీ ఆదేశించడం దారుణమన్నారు. రాష్ట్రానికి సరఫరా చేసే సమయంలో జరిగిన హెచ్చుతగ్గులకు చెందిన వాస్తవ చార్జీలను చెల్లించడానికి సిద్ధమేనని చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన భారాన్ని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలపై మోపడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇదే తరహా నోటీసుల అమలును నిలిపివేస్తూ ఇటీవల కేరళ, మద్రాసు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తు చేశారు. వాదనల తర్వాత హైకోర్టు రూ.179 పాత బకాయిల చెల్లింపునకు సంబంధించిన నోటీసు అమలును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *