చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

– విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్
– ఈనెల 13న ఒక్క రోజే 341 మిలియన్ యూనిట్ల సరఫరా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శనివారం(13వ తేదీ) ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధికస్థాయికి చేరుకుంది. 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి గత రికార్డు అయిన 335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025)ను అధిగమించింది. అదేవిధంగా 18,228 మెగావాట్ల గరిష్థ విద్యుత్ డిమాండ్‌ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ తన వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతుంది. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం, సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్, సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *