విద్యుత్ విభాగం ప్ర‌క్షాళ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు

– రాష్ట్రంలో  కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయండి
– కొత్త డిస్కమ్‌ ప‌రిధిలోకి ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు
– అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఉండాలి
– అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
– ఇంధ‌న శాఖ‌పై డిప్యూటీ సీఎంతో క‌లిసి స‌మీక్ష‌

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూలై 30 : రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రం లో  కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖపై తన నివాసంలో బుధ‌వారం అధికారులతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌డీసీఎల్ తోపాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని పలు సూచనలు చేశారు. దీంతో ఇపుడున్న డిస్కమ్ ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని అన్నారు. ఎన్‌పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌లు వాణిజ్య విద్యుత్‌ కార్యకలాపాలు చేపడతాయని, కొత్త డిస్కమ్‌ ప్రభుత్వ సబ్సిడీపై అందించే విద్యుత్‌ నిర్వహణకు వీలుగా విభజన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్కమ్ ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిస్కమ్ ల పునరవ్యవస్తీకరణతోపాటు విద్యుత్ సంస్థల పై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించడానికి వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు.  10 శాతం వరకు వడ్డీ పై తీసుకున్న రుణాల తో డిస్కమ్ లు డీలా పడ్డాయని, ఈ రుణాలను తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని అదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని అధికారులకు సూచించారు. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో విద్యుత్‌ అవసరాలతో పాటు పార్కింగ్‌ ఇబ్బందులు తొలగిపోయేలా సచివాలయం చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌, సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇందిర సోలార్‌ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని ఆదేశించారు. మూడేళ్లలో 2లక్షల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6లక్షల ఎకరాలకు సౌర విద్యుత్‌ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. స‌మీక్ష‌లో  ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, టీజీ జెన్కోసీఎండీ హరీష్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, టీజీ రెడ్కో  వీసీ అండ్ ఎండీ అనిల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *