– సరఫరాలో అవాంతరాలు లేకుండా జాగ్రత్త వహించాలి
– గతేడాదితో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్ డిమాండ్
– అధికారులతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీజీఎస్పీడీసీఎల్) సంస్థ అధికారులతో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీతో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేస్తున్నారని మిట్టల్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలతోపాటు గృహ రంగంలో కూడా భారీ వినియోగం నమోదవుతున్నదని, దీనికితోడు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండటంతో లక్షలాది మోటర్లు నిరంతరం నడుస్తున్నాయని, ఫలితంగా వర్షాల సీజన్‌లో కూడా భారీగా డిమాండ్ నమోదవుతున్నదని తెలిపారు. గతేడాది (2024) జులై 31న 13,541 మెగావాట్లుగా నమోదైన గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది జులై 16న 14.05 శాతం పెరుగుదలతో 15,443 మెగావాట్లుగా నమోదయిందని ఆయన వివరించారు. పుష్కలంగా వర్షాలు పడుతుండటంతో నీటి లభ్యత బాగా పెరిగిందని, వరి నాట్లు జోరందుకోవడంతో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎండీ స్థాయి నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా వుంటూ ఎలాంటి అవాంతరాలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వుంటూ వర్షాల సమయంలో తప్పనిసరిగా తమ కార్యాలయాల్లో అందుబాటులో వుంటూ సరఫరా పర్యవేక్షించాలని నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు డాక్టరు నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండిరగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


