హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావు..: సీ ఎమ్ రేవంత్ రెడ్డి 

అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది? 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నాం. అప్పుడే మీకు అంత అసహనం ఎందుకు? కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి.. సూచనలు ఇవ్వండి. మీరు హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావు.. ఎన్నికలు వొచ్చేది 2028లోనే..  బీఆర్ఎస్ లో వాళ్ల మధ్య పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా.. గజ్వేల్ శాసనసభ్యుడు వొచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇటీవల పద్మారావు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చాం..మేం మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవు. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు.. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదు. డాంబికాలతో మేం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు.  చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. 95 శాతం మేం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారు.  ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదు ఆ భూమిలో గుంట నక్కలు ఉన్నాయి. ఆ గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం. ఓపెన్ యాక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకొస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నాం. హరీష్ రావును సూటిగా అడుగుతున్నా.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా? రేడియల్ రోడ్లు వేయాలా వద్దా? అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా? ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా? కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు? ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిది? మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మీ కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోం అభివృద్ధి,  భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి.. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి.  ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు. అని అన్నారు.

ఉప ఎన్నికలు రావు..
మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం.  సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు.. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు., మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే. ప్రతిపక్షానికి మేం సూచన చేస్తున్నాం.  మీపై మాకు ద్వేషం లేదు.. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో శిక్షించారు.. ఇక మీపై మాకు కోపం ఎందుకుని ఉంటుంది? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలివ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితువు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *