‘స్థానిక’ ఎన్నికలు అధికార పార్టీకి పెను సవాల్?

* న్యాయ స్థానం పరిధిలో రిజర్వేషన్ ల అంశం
* ⁠ఖర్చుల మీమాంసలో అభ్యర్థులు
* ⁠ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్న ప్రతిపక్షాలు
* ⁠రద్దయిన ఎన్నికలను ఉదాహరణ గా చూపుతున్న విశ్లేషకులు 

                                                                     (ప్ర‌జాతంత్ర బ్యూరో ‌, హైద‌రాబాద్‌)
ఎన్నో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 42% బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి జీ.ఓ.ను విడుద‌ల చేసి స్థానిక ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోంది. ప్ర‌స్తుతం ఈ రిజ‌ర్వేష‌న్ వివాదంపై హైకోర్టులో కేసు న‌డుస్తున్న నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల న‌గారా మోగ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు అమ‌ల్లో వున్న 23-25 శాతం బీసీ రిజర్వేష‌న్ల‌ను ఏకంగా 42 శాతానికి పెంచ‌డం ఎంత‌వ‌ర‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మ‌న్న ప్ర‌శ్నకు ప్ర‌భుత్వం ఇచ్చే స‌మాధానం కుల‌గ‌ణ‌న ద్వారా తేలిన బీసీల జ‌నాభాను బ‌ట్టి ఈ రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతోంది. బీఆర్ ఎస్‌, బీజేపీలు కూడా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బీసీల వోట్ల ను త‌మ‌కు అనుకూలంగా తిప్పుకోవాల‌న్న ఉద్దేశంతోనే ఈ రిజ‌ర్వేష‌న్ల బిల్లును తీసుకొచ్చి శాస‌న‌స‌భ ఆమోదం పొంది, గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంపింది. ప్ర‌స్తుతం ఇది రాష్ట్రప‌తి ప‌రిశీల‌న‌లో వుంది. నిజం చెప్పాలంటే రాజ్యాంగం ప్ర‌కారం మొత్తం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతానికి మించ‌డానికి వీల్లేదు. 2023లో బిహార్‌లో ఇదేమాదిరి రిజ‌ర్వేష‌న్ల‌ను 65శాతానికి పెంచేయ‌డంతో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. మ‌రి ఈ సంగ‌తి రేవంత్ ప్ర‌భుత్వానికి తెలియ‌ద‌ని అనుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మే అవుతుంది. అన్ని పార్టీల‌కు బీసీల వోట్లు కావాలి క‌నుక‌, శాస‌న‌స‌భ‌లో బిల్లును వ్య‌తిరేకించ‌లేదు. రిజ‌ర్వేష‌న్ల స‌మ‌స్య కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోది క‌నుక ఇక్క‌డ అసెంబ్లీ ఆమోదించినా ప్ర‌యోజ‌నం వుండ‌ద‌న్న సంగ‌తి వాటికి స్ప‌ష్టంగా తెలుసు క‌నుక ఆవిధంగా మ‌ద్ద‌తిచ్చాయ‌నుకోవాలి. ఇక్క‌డ మ‌రో అంశాన్ని గుర్తుంచుకోవాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అత్య‌వ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త‌ప్ప 50% రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని మించ‌కూడ‌ద‌నేది సుప్రీంకోర్టు త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది. అంటే రిజ‌ర్వేష‌న్లు పెంచవ‌ద్ద‌ని క‌చ్చిత‌మైన నిబంధ‌న విధించ‌లేదన్న‌ది ఇక్క‌డ గుర్తుంచుకోవాలి. అయితే రిజ‌ర్వేష‌న్ల పెంపు గ‌తంలో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% ప‌రిమితిని అతిక్ర‌మిస్తోందంటూ ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో వుంది. విచిత్ర‌మేమంటే బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం జారీ చేసిన జీఓపై హైకోర్టు స్టే విధించ‌లేదు. ప్ర‌భుత్వం ఇచ్చిన జీఓ ప్ర‌కారం స్థానిక ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్లు 67శాతానికి చేరుకుంటాయి. ఈ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు తాను ఇవ్వ‌బోయే తుదితీర్పుపై ఆధార‌ప‌డి వుంటుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో, మ‌రి ప్ర‌భుత్వం జీఓ ద్వారా అమ‌లు చేయ‌నున్న రిజ‌ర్వేష‌న్లు త్రిశంకు స్వర్గంలో వున్న‌ట్టే లెక్క‌. మ‌రి ఇదే హైకోర్టు స్థానిక సంస్థ‌ల కాల‌ప‌రిమితి ముగిసిపోయినందువ‌ల్ల త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఆదేశించింది. స‌రిగ్గా రాష్ట్రప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌, అందుకనుగుణంగా బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంపు వ‌రుస‌గా జ‌రిగిపోయాయి. ఒక‌వైపు కోర్టులో కేసు తీర్పు ఏవిధంగా వుంటుందో తెలియ‌ని స్థితిలో నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల్లో 12765 స‌ర్పంచ్‌, 1,12,000 వార్డుమెంబ‌ర్లు, 5800మంది ఎంపీటీలు, 50 జ‌డ్పీటీసీల‌ను ప్ర‌జ‌లు ఎన్నుకోవాల్సి వుంటుంది. ఒక‌వైపు కోర్టులో ఎటూతేల‌ని కేసు, మ‌రోవైపు ఎంత‌వ‌ర‌కు చెల్లుబాట‌వుతుందో తెలియ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ జీఓ, రాష్ట్రప‌తి వ‌ద్ద పెండింగ్‌లో వున్న బిల్లు…ఇంత‌టి సందిగ్ధ ప‌రిస్థితుల్లో స్థానిక సంస్థ‌ల‌కు జ‌రిగే ఎన్నిక‌ల భ‌విత‌వ్యం ఎట్లావుంటుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే ఎన్నిక‌ల షెడ్యూలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, ఆయా ప‌ద‌వుల‌కు పోటీప‌డే అభ్య‌ర్థులు ఎంత ఖ‌ర్చుకైనా వెనుకాడ‌బోర‌నేది సుస్ప‌ష్టం. ఇంత క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల్లో గెలిచిన వారు, ఈ రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా కోర్టు తీర్పు వెలువ‌డితే ప‌రిస్థితేంట‌నే ప్ర‌శ్న‌కు ప్ర‌స్తుతం స‌మాధానం లేదు. ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారు, ఓడిన‌వారు య‌దేచ్ఛ‌గా ఖ‌ర్చు పెట్టుకుంటారు. మ‌రి వీరి ఖ‌ర్చంతా వృధా కావ‌ల‌సిందేనా?
బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు రాష్ట్రప‌తి ఆమోదం కోసం ముఖ్య‌మంత్రి స‌హా రాష్ట్ర కేబినెట్ మంత్రులంతా దిల్లీలో హ‌డావిడి చేశారు. కానీ ఫ‌లితం శూన్యం. ఎందుకంటే కేంద్రం లెక్క‌లు వేరుగా వుంటాయి. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థికి క్రెడిట్ ద‌క్కేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఆత్మ‌హ‌త్యా స‌దృశ‌మేన‌న్న సంగ‌తి ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడికి తెలిసిందే. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు ప్ర‌స్తుతం, రాజ‌కీయం, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య నెల‌కొన్న ప‌ర‌స్ప‌ర విరుద్ధ వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయ‌నేది అక్ష‌ర‌స‌త్యం. అన్నీ జ‌రిగిన త‌ర్వాత ఎన్నిక‌లు ర‌ద్ద‌యితే అభ్య‌ర్థులు పెట్టుకున్న ఖ‌ర్చుకు ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి? ఇక్క‌డ మూడు ప‌ర‌స్ప‌ర మూడు వైరుధ్యాలు క‌నిపిస్తున్నాయి. స‌కాలంలో ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పు, అమ‌ల‌వుతాయో కావో తెలియ‌ని స్థితిలో రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచిన బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఈ గంద‌ర‌గోళంలోనే ఎన్నిక‌ల సంఘం స్థానిక షెడ్యూలును ప్ర‌క‌టించ‌డం. ఇక్క‌డ ఎవ‌రి ప‌ని వారు చేశామ‌ని ఈ మూడు వ్య‌వ‌స్థ‌లు భావించ‌వ‌చ్చు గాక‌! కానీ ఎన్నిక‌లు ప్ర‌క్రియే ఇప్పుడు కార్య‌నిర్వాహ‌క‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య న‌లిగిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కోర్టు తీర్పు అనుకూలంగా వ‌స్తే స‌రే! తీర్పు వ్య‌తిరేకంగా వొచ్చినా, ఎన్నిక‌లు ర‌ద్ద‌యినా నిండా మునిగేది పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చులు పెట్టుకొని ఎన్నిక‌ల్లో పోటీచేసిన అభ్య‌ర్థులు మాత్ర‌మే! నిజం చెప్పాలంటే న్యాయ నిపుణులు, ఎన్నిక‌ల సంఘంలో ఎంతో అనుభ‌వం గ‌డించిన‌వారు, విశ్లేష‌కులు ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నిని త‌ప్పు ప‌డుతున్నారు. ఒక‌ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తున్న‌ప్పుడు మ‌రోప‌క్క బిల్లుకు రాష్ట్రప‌తి ఆమోదం ఇంకా పెండింగ్‌లో వున్న‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం జి.ఒ.ను తీసుకొచ్చి, దీని ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రుపుతామ‌న‌డంలో ఎంత‌మాత్రం ఔచిత్యం లేదు. కోర్టు తీర్పు అనుకూలంగా రాక‌పోతే అభాసుపాల‌య్యేది రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే. ఎన్ని రాజ‌కీయాలు చేసినా, వాస్త‌వాల‌ను అంచ‌నావేయ‌కుండా తీసుకునే చ‌ర్య‌ల ఫ‌లితాలు కూడా అంతే నిప్ప‌చ్చ‌రంగా వుంటాయ‌నేది ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఎందుకు అవ‌గాహ‌న‌కు రావ‌డంలేదో అర్థం కాదు. అందుక‌నే వివేచ‌న‌తో కూడిన రాజ‌కీయం మాత్ర‌మే స‌త్ఫ‌లితాలిస్తుంది. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రి ప్ర‌తికూల ప‌రిణామాల‌ను అంచ‌నా వేసిందా లేదా అన్న‌ది స్పష్టం కాన‌ప్ప‌టికీ, ఈ రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌పై ఏవిధ‌మైన ప్ర‌భావం చూపుతుంద‌నేది కాల‌మే నిర్ణ‌యించ‌గ‌ల‌దు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *