ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధమేనా?

– సన్నద్ధతపై అంచనాకు ఎన్నికల సంఘం సమావేశం

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: దేశవ్యాప్తంగా జరగనున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించి సన్నద్ధతను అంచనా వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం న్యూదిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలెక్టర్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం నిర్వహించింది. సమావేశాన్ని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రారంభించగా, ఎన్నికల కమిషనర్లు డాక్టర్‌ సుఖబీర్‌ సింగ్‌ సాంధు, డాక్టర్‌ వివేక్‌ జోషి హాజరయ్యారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల కార్యాలయాలు దేశవ్యాప్త ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధమయ్యాయా అనే అంశాన్ని కమిషన్‌ సమీక్షించింది. బీహార్‌ ముఖ్య ఎన్నికల అధికారి తమ అనుభవాలను దేశంలోని ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు తెలుసుకునే విధంగా వ్యూహాలు, పరిమితులు, ఉత్తమ పద్ధతులపై ఒక ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. తమ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో చివరి ఎస్‌ఐఆర్‌ ప్రకారం ఓటర్ల సంఖ్య, అర్హత తేదీ, ఓటర్ల జాబితా వివరాలను సీఈవోలు సమగ్రంగా వివరించారు. అలాగే డిజిటలైజేషన్‌ స్థితి, గత ఎస్‌ఐఆర్‌ అనంతరం ఓటర్ల జాబితా అప్‌లోడ్‌ చేసిన స్థితి గురించి కూడా తెలిపారు.ప్రస్తుత ఓటర్లను గత ఎస్‌ఐఆర్‌లోని ఓటర్లతో పోల్చి మ్యాపింగ్‌ స్థితిని కూడా వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండకూడదన్న ఎన్నికల సంఘం ఆదేశాన్ని అమలు చేసేందుకు పోలింగ్‌ కేంద్రాల సర్దుబాటు స్థితి కూడా సమీక్షించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో ఉండేలా, అర్హత లేని వారు చేరకుండా ఉండేలా పత్రాలను సూచిస్తూ సీఈవోలు సిఫార్సులు చేశారు. ఈ పత్రాలు అర్హులైన పౌరులకు సులభంగా సమర్పించుకునే విధంగా ఉండాలని పునరుద్ఘాటించారు. డీఈవోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏల నియామకాలు శిక్షణ స్థితిని కూడా కమిషన్‌ సమీక్షించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page