(అహ్మద్‌నగర్ జైలు నిర్బంధంలో ఉన్నపుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ తన మిత్రుడు సదర్‌యార్ జంగ్ నవాబ్‌కు రాసిన లేఖ)
అనువాదం : దేవులపల్లి మదన్ మోహన్ రావు
-సేకరణ : వీణ
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
అహ్మద్ నగర్ కోట
1943, జనవరి 9
ప్రియ మిత్రమా! అహంభావ సాహిత్యాన్ని (జుస్త్రశీఱర్‌ఱష ూఱ్‌వతీa్‌బతీవ) ఈ మధ్య కొందరు విమర్శకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ విధమైన సాహిత్యం ఎంతో మనోరంజకంగా ఉంటుందని, లేనట్లయితే దానికి భిన్నంగా ఉంటుందని అన్నారు. అహంభావ సాహిత్యంలో రచయిత ‘అహంభావం’ ‘స్పష్టంగా’ కనిపిస్తుంది. పైన చెప్పినట్టు ఆ రెండు మార్గాలు తప్పితే మరో మార్గంలేదు. ‘స్పష్టంగా’ అనే పదాన్ని వాడకపోతే ఈ సాహిత్య పరిధిలోకి చాలామంది వొచ్చే అవకాశం ఉన్నది. ప్రతి రచయిత రచనలలో ఇటువంటి భావాలు వొచ్చే అవకాశం ఉంది. బాహాటంగా, స్పష్టంగా అహంభావాన్ని చాటే రచనలను మాత్రమే అహంభావ సాహిత్యంలోకి తీసుకుంటాము.
‘అహంభావం’ అంటే ఏమిటి? ఇది రచయితలలో ఎందుకు కనిపిస్తుంది? ప్రతి రచయిత తన ఊహలకు, ఆలోచనలకు, భావాలకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండాలని కోరుకుంటాడు. ఈ ఆలోచనలే వారివారి రచనలలో కొంత అహంభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఫైజ్ కవి- నల దమయంతుల కథ చెప్పినప్పుడు ఇటువంటి అహంభావమే కనిపిస్తుంది. ఇదేవిధంగా అనీస్ రచనలలోనూ ఇంకొందరు కవుల రచనలలోనూ మనం ఈ పరిస్థితిని గమనిస్తాము. అహంభావానికి సంబంధించిన ఇటువంటి చైతన్యంలో ఓ విచిత్రం ఉన్నది. వ్యక్తిగతమైన అహంభావం నీడలు అంతర్గతంగా ఒకరకంగా బహిర్గతంగా మరోరకంగా ఉంటాయి. ‘‘ఆత్మగౌరవానికి సంబంధించిన అద్దంలో మనముందు కనిపించే రూపానికి వెనక కనిపించే రూపానికి వ్యత్యాసం ఉంటుంది.’’
రచయితకు వొచ్చిపడే అవస్థే ఇది. రచయిత తను చాలా గొప్పవాడనుకుంటూ ఆ అభిప్రాయాన్ని తన ఆలోచనలలో ఇముడ్చుకొని రచనలు చేస్తాడు. బయటి ప్రపంచం, పాఠకలోకం మాత్రం రచయిత అనుకున్నంత ప్రాముఖ్యతను ఆ రచనలకు ఇవ్వదు. ‘‘నా ఆకార స్వరూపాలు అద్దంలో స్పష్టంగా ఇమిడిపోతున్నవి. వాటిలో నేను చూడగలిగినవి చూడలేనివి వేరే ఎవ్వరు గ్రహించలేరు.’’ కొందరు రచయితలకు వారు ఆశించక పోయినప్పటికీ ఎంతో ప్రాముఖ్యత, ప్రశంస, ఆదరణ లభించినాయి.
వాళ్లల్లో ఉండే ‘ఆహాన్ని’ కూడా ఆదరించడం తప్ప వేరేమార్గం లేకుండా పోయింది. వీళ్లంతా గొప్పవాళ్లు. మనం ఫోటోలు తీసుకున్నప్పుడు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటాము. కొన్నిసార్లు అసలు ఏ ఏర్పాట్లు లేకుండానే ఫోటోలు తీసుకుంటాము. వీటిలో హంగులతో దిగిన ఫోటోల కంటే సహజంగా దిగిన ఫోటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. రచనల విషయానికి వొస్తే కూడా అంతే. ఈ అహం ఎన్నో విధాలు. కొందరిలో పైకి కనిపించక దాక్కొని ఉంటుంది. మరికొందరిలో ప్రస్పుటంగా పైకి కనిపిస్తూ తెలిసిపోతూ ఉంటుంది. ‘‘నా ఆక్రందనలు నలుదిశల ప్రతిధ్వనిస్తూ ఉన్నవి.
లోకం వారిని ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో వింటున్నది.’’ కొందరిలో ఈ ‘అహం’ చాలా తక్కువ మోతాదులో ఉండి, వాళ్ళ యోగ్యతకు తగ్గట్టుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అది ఎవ్వరికీ వెగటుగా వొచ్చెట్టుగా అనిపించదు. పైగా దానికి భిన్నంగా వాళ్లలోని ఆ ‘అహం’ మనకెంతో బాగా అనిపిస్తుంది. అహంభావ సాహిత్యంలో ముఖ్యమైనవి ఆత్మకథలు. వీటిల్లో సేంట్ అగస్టీన్, స్ట్రాండ్ బర్గ్, రూసో, టాల్‌స్టాయ్, అసాతుల్- ఇటు తూర్పుదేశాలకు చెందిన రచయితలు గజ్జాలీ, ఇబినె, ఖలూన్, బాబర్, జహంగీర్ రాసుకున్న ఆత్మకథలు మనకు వెగటును గానీ, అసహ్యాన్ని గానీ కలిగించవు. ఇవన్నీ గొప్పగొప్ప రచనలకు నిదర్శనాలు. బదాయూని రచనల్లో సైతం ‘అహం’ ఉన్నది. అయినా వాటిల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. ఆయన రచనలను విస్మరించలేము. అంతేకాదు, వాటిని మళ్లీ మళ్లీ చదువుతాం. టాల్‌స్టాయ్ పరిస్థితి అంతే. ఆయనకు సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది, చిరస్మరణీయమైనదీనూ! గడిచిన శతాబ్దంలో ఇటువంటి ఆత్మకథలు ఎందరో రాసారు. అన్నిటికీ గ్రంథాలయాలలో స్థానం లభించింది. కానీ, ప్రపంచపు దృష్టిని ఆకర్షించగలిగినవి వాటిల్లో కొన్ని గ్రంథాలు మాత్రమే అని చెప్పక తప్పదు.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల