– అర్హులందరికీ పోషకాహారం అందేలా చర్యలు
– ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన అధికారులు
– ఆమోదం లభించిన వెంటనే ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలు అందని అర్హుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు దిశగా మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 2,364 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అయితే శాఖ నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 274 కవర్ కాని బస్తీల్లో 25,310మంది అర్హులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలను గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో వీరికి పోషకాహార సేవలు సక్రమంగా అందడం లేదని వెల్లడైంది. అధిక జనసాంద్రత, తరచూ వలసలు, నిబంధనల పరిమితులు, బస్తీల్లో భవనాల లభ్యత లేకపోవడం, సాంకేతిక అడ్డంకులు వంటి కారణాల వల్ల కొత్త అంగన్‌వాడీ కేంద్రాల స్థాపనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఒక్క అర్హుడు కూడా నష్టపోకూడదు.. పోషకాహారానికి ఆటంకం కలగకూడదు అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలలో భాగంగా పోషక లోప రహిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరకులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాలామృతం, పాలు, స్నాక్స్, కోడిగుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా 274 మురికివాడలను కవర్ చేస్తూ 37 వాహనాలను అద్దెకు తీసుకుని మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.60 వేల అద్దె చెల్లించనున్నారు. జిల్లాలవారీగా హైదరాబాద్‌లో 7, మేడ్చల్-మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్ కేంద్రాలను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్‌వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





