– ఇందులో భాగంగానే వివిధ రకాల క్రీడా పోటీలు
– 15 రోజుల పాటు 30 మైదానాల్లో నిర్వహణ
– క్రీడల్లో మనం రాణించాలి
– క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రధాని
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025–26ను ప్రారంభించిన గవర్నర్
సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో, దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్‌లోని డిగ్రీ, ఇంటర్ కాలేజీ క్రీడలతోపాటు బస్తీల్లోని మహిళల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ చైర్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మీడియా ప్రతినిధుల కోసం, ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం కూడా క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025–26 ప్రారంభోత్సవ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ పోటీలు 15 రోజులపాటు సుమారు 30 గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, అన్ని డివిజన్ల వారీగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, అథ్లెటిక్స్‌తో పాటు ఇతర అనేక క్రీడలు కూడా ఉన్నాయి. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సుమారు లక్ష మంది పాల్గొనే విధంగా ఈ తరహా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ
రానున్న రోజుల్లో దేశం క్రీడారంగంలో ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఈ క్రీడా పోటీల నిర్వహణ కొనసాగుతోందన్నారు. మన దేశం జనాభాపరంగా, యువత జనాభాపరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కొన్ని క్రీడల్లో వెనుకబడి ఉన్నాం.. అందుకే ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.. ప్రధాని క్రీడాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఓడిపోయిన సందర్భాల్లో కూడా నిరుత్సాహపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ప్రేరేపిస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు గణనీయంగా రాణిస్తున్నారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ఫిట్‌నెస్ సదుపాయాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోందని చెప్పారు. అంతేకాక రానున్న రోజుల్లో కామన్‌వెల్త్ గేమ్స్ దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్‌ను కూడా భారతదేశంలో నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ పోటీల్లో సుమారు 35 వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, బ్యాడ్మింటన్ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, దృష్టి కేసరి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే