– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు
– మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచన
– పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్: ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంపు చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడిరచారు. ఈ సవరణ బిల్లుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డి వేముల శ్రీనివాస్ తదితరులతో శనివారం సమావేశం నిర్వహించారు. భారతీయ స్టాంపు చట్టం 1899 ప్రకారం తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లను, 26 ఆర్టికల్స్‌ను సవరించేందుకు 2021లో శాసనసభలో సవరణ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిందని, ఈ బిల్లుపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో ఈ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2021లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకుని ప్రస్తుత కాలానికనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడిరచారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని, నిబంధనలు కట్టుదిట్టమైన రూపంలోకి తీసుకురావడం, కొత్త ఒప్పందాలకు చట్టబద్దత కల్పించడం లక్ష్యంగా బిల్లును రూపొందించాలని, అలాగే పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సూచించారు. సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకనుగుణంగా భూముల ధరలను సవరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉందో అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. మహిళాభ్యుదయం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని, దీనిలో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని, కొత్త, పాత అపార్టుమెంట్లలకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందని, పాత అపార్టుమెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని, ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు.





